HCA: ‘డబ్బులు కొట్టు.. బ్యాట్ పట్టు.. హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్న అజారుద్దీన్..’

By Srinivas MFirst Published Nov 29, 2022, 10:38 AM IST
Highlights

Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ పాలనలో  హెచ్‌సీఏ  భ్రష్టుపట్టుపోయిందని  బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ ఆరోపించారు. హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతున్నదని, ఆటగాళ్ల నుంచి అజారుద్దీన్ డబ్బులు వసూలు చేస్తున్నాడని మాజీ అధ్యక్షులు తీవ్ర ఆరోపణలు చేశారు. 

మహ్మద్ అజారుద్దీన్ పాలనలో హెచ్‌సీఏ భ్రష్టుపట్టిందని, అవినీతికి అడ్డాగా మారిపోయిందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌తో పాటు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, జి.వినోద్  తీవ్ర ఆరోపణలు చేశారు.   అజారుద్దీన్ ఆటగాళ్ల నుంచి  డబ్బులు వసూలు చేస్తున్నాడని,  పదవీకాలం ముగిసినా కుర్చీని పట్టుకుని వేలాడుతూ హెచ్‌సీఏను భ్రష్టుపట్టిస్తున్నాడని   ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా నిర్వహించే సమావేశాలకు వెళ్లొద్దని క్లబ్ మెంబర్స్ ను బెదిరిస్తూ  నియంతలా వ్యవహరిస్తున్నాడని  విమర్శించారు. ఈ మేరకు  సోమవారం  శివలాల్ యాదవ్, అర్షద్, వినోద్,  హెచ్‌సీఏ మాజీ కార్యదర్శులు శేష్ నారాయణ,  జాన్ మనోజ్ లు  అజారుద్దీన్ పై నిప్పులు చెరిగారు. 

విలేకరుల సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. ‘అజార్ పాలనలో మూడేండ్లలో హెచ్‌సీఏ భ్రష్టుపట్టింది.   అండర్ -14, 16, 19, 22, సీనియర్ జట్లలో ఆటగాళ్ల ఎంపిక వ్యాపారంగా మారిపోయింది.  ఒక్కో మ్యాచ్ కు  రూ. 15 లక్షలు తీసుకుంటేగానీ ఆడనివ్వడంలేదు.  వయోపరిమితి ధ్రువీకరణ  పత్రం కోసం  కూడా రూ. 3 లక్షల దాకా వసూలు చేస్తున్నారు.  

ఒక జట్టులో నిబంధనల ప్రకారం 15 మందినే ఎంపిక చేయాల్సి ఉన్నా  ఏకంగా 30 మందిని  టోర్నీలకు పంపిస్తున్నారు.  అజారుద్దీన్ పదవీ కాలం  సెప్టెంబర్ 26తోనే ముగిసింది. అయినా ఇంకా ఆయన ఆ కుర్చీని పట్టుకుని  వేలాడుతున్నాడు.అజార్ అత్యంత అవినీతిపరుడు.  నిబంధనల ప్రకారం  ఏజీఎం నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటించాలి..’ అని డిమాండ్ చేశారు. 

శివలాల్ యాదవ్  స్పందిస్తూ.. ‘జస్టిస్ కక్రూ నివేదిక ఇస్తే  ఆయనను కూడా విమర్శిస్తున్నారు. నేను ఎప్పుడూ కక్రూను కలవలేదు.  ఆయన తీర్పును మేం గౌరవిస్తున్నాం.  జనరల్ బాడీ మీటింగ్ వీలైనంత త్వరగా చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం.  కానీ అజార్ దానిని జరపకుండా అడ్డుకుంటున్నాడు. మాతో సమావేశానికి వచ్చే క్లబ్ కార్యదర్శులను బెదిరిస్తున్నాడు..’ అని  తెలిపారు. 

అర్షద్ అయూబ్ స్పందిస్తూ.. ‘అజార్ అన్నీ తానై నియంతలా వ్యవహరిస్తున్నాడు.  గడువు ముగిసినప్పటికీ ఇంకా తన పరిపాలనా వ్యవహారాలలో తలదూరుస్తున్నాడు. రూల్స్ అనేవి ఎవరికోసం పెట్టివే కాదు కాని అజార్ మాత్రం అతనికోసం హెచ్ సి ఎ రూల్స్ పెట్టుకున్నాడు.అజార్ క్రికెట్ ను గిల్లిదండ్ గా మార్చాడు. వంక ప్రతాప్ తో కలిసి అజార్ సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ కక్రుకు తప్పుడు సమాచారం  సమర్పించారు. డబ్బులిచ్చే వారినే  జట్టులోకి తీసుకుంటున్నారు. క్రికెట్ ఆడాలంటే  డబ్బులు కట్టాల్సిందేనని  అజార్ చెప్తున్నాడు..’ అని చెప్పారు. 

హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి  శేషు నారాయణ మాట్లాడుతూ.. ‘ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 11 న  హెచ్ సి ఏ అత్వసర ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్ ఉంది. దానికి బిసిసిఐ అబ్జర్వర్ రావాలని కోరుతున్నాం.  ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికే ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ ఆలస్యమైంది. కలెక్టర్ అధ్యక్షతన  33 జిల్లాలకు క్రికెట్ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు బీసీసీఐ నిబంధనలు ప్రకారం చెల్లవు..’ అని అన్నారు. 
 

click me!