
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను గాయాల బెడద వేధిస్తున్నది. ఇప్పిటికే రూ. 14 కోట్లు పెట్టి కొనుక్కున్న దీపక్ చాహర్.. సీజన్ నుంచి దూరమవగా ఇప్పుడు ఆ జట్టు మరో కీలక బౌలర్ ఆడమ్ మిల్నే కూడా గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చాడు లంక కుర్రాడు మతీష పతిరన. పేరు కొంచెం విచిత్రంగా ఉన్నా.. కుర్రాడు మాత్రం బుల్లెట్ లా దూసుకుపోతాడు. శ్రీలంకలో ‘జూనియర్ లసిత్ మలింగ’ గా గుర్తింపు పొందిన పతిరన.. గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగల సమర్థుడు. మిల్నే స్థానంలో జట్టులోకి వచ్చిన పతిరన.. మరో మలింగ అవుతాడని లంక అభిమానులు ఆశిస్తున్నారు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షలతో చెన్నై జట్టు పతిరనను దక్కించుకున్నది. పతిరన బౌలింగ్ యాక్షన్ కూడా మలింగనే పోలి ఉంటుంది. శ్రీలంక తరఫున అండర్-19 ప్రపంచకప్ 2020, 2022 లలో ఆడాడు.
2020 అండర్-19 వన్డే ప్రపంచకప్ సందర్భంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో పతిరన తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.ఆ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ.. 175 కి.మీ. స్పీడ్ తో నిప్పులు చెరిగాడు. ఆ బౌలర్ ను ఎదుర్కున్న బ్యాటర్ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్. అయితే ఆ బంతి వైడ్ కావడం గమనార్హం. ఏదేమైనా పతిరన సీఎస్కే జట్టులోకి రాగానే అతడికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలతో ట్విట్టర్ హోరెత్తిపోతున్నది.
లంకలో జూనియర్ మలింగ గా పేరు సంపాదించుకున్న పతిరన.. ఆ దేశంలో దేశవాళీ క్రికెట్ లో మెరపులు మెరిపిస్తున్నాడు. సీఎస్కే తరఫున అతడు ఆడుతుండటంతో అతడిపై మీమ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రమే ఈ సీజన్ లో 150-158 కి.మీ. వేగంతో బంతులు విసరుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఇక మతీష పతిరన వచ్చి ప్రపంచకప్ ఫీట్ ను రిపీట్ చేస్తే.. కొత్త చరిత్రే అవుతుంది అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.
ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన బౌలర్ కు స్విగ్గీ ఇచ్చే స్విగ్గీ ఇన్స్టా మార్ట్ ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు కూడా పతిరన రావడంతో షేక్ అవుతుందని మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
- ఇటీవలే వెస్టిండీస్ వేదికగా ముగిసిన ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ లో లంక తరఫున ఆడిన పతిరన.. నాలుగు మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు.
- మలింగ మాదిరిగానే బౌలింగ్ యాక్షన్ ను కలిగి ఉండటమే గాక వైవిధ్యం కూడా కలిగి ఉన్నాడు.
- ఒకవేళ పతిరనకు గనక మ్యాచ్ లో ఆడి అవకాశమొచ్చి నిరూపించుకుంటే అతడిని చెన్నై వదులుకునే సాహసం చేయలేకపోవచ్చు.