IPL 2022: సగం సీజన్ ముగిసింది.. ఎవరి కథ ఎట్లుంది.. ప్లేఆఫ్స్ కు వెళ్లేదెవరు..? ఫైనల్ ఎక్కడ..?

Published : Apr 23, 2022, 11:29 PM IST
IPL 2022: సగం సీజన్ ముగిసింది.. ఎవరి కథ ఎట్లుంది.. ప్లేఆఫ్స్ కు వెళ్లేదెవరు..? ఫైనల్ ఎక్కడ..?

సారాంశం

IPL 2022 Points Table: గత రెండు సీజన్లుగా భారత్ లో ప్రేక్షకులకు దూరమైన ఈ ఏడాది  కావాల్సినదానికంటే ఎక్కువ వినోదాన్నే పంచుతున్నది.   ఈ సీజన్ లో ఇప్పటికే సగం మ్యాచులు పూర్తయ్యాయి.  ఈ నేపథ్యంలో ఏ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఎట్లున్నాయో చూద్దాం. 

గత నెల 26న అట్టహాసంగా మొదలైన ఐపీఎల్ విజయవంతంగా సాగుతున్నది. భారీ స్కోర్ల మ్యాచులే కాదు.. లో స్కోరింగ్  గేమ్స్ కూడా ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచుతున్నాయి. ఈసారి పది జట్లతో బరిలోకి దిగిన ఐపీఎల్.. అభిమానులకు కావాల్సినంత ఆటను, వినోదాన్ని అందిస్తున్నది. 74 మ్యాచులు ఆడాల్సి ఉన్న ఈ  రెండు నెలల (మార్చి 26 నుంచి మే 29 వరకు) సుదీర్ఘ షెడ్యూల్ లో శనివారం  ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ తో కలిపి 36 మ్యాచులు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎన్ని విజయాలు సాధించింది..? టాప్-4లో ఉన్న జట్లెన్ని..? ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలున్న జట్లు ఏవి..? ఫైనల్ ను ఎక్కడ నిర్వహిస్తారు..? తదితర విషయాలపై ఓ లుక్కేయండి. 

శనివారం నాటికి అన్ని జట్లు 7 మ్యాచులు (సీజన్ లో ఒక జట్టు 14 మ్యాచులు ఆడాలి)  ఆడాలి. ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్ లు 8 మ్యాచులు ఆడేశాయి. ఎవరూ ఊహించని విధంగా వరుస విజయాలతో  హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఆడిన 7 మ్యాచులలో ఆరు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. 

టాప్-4.. లాస్ట్ 2 

సగం సీజన్ పూర్తయ్యేసరికి  పాయింట్ల పట్టికలో గుజరాత్ (7 మ్యాచులు.. 6 విజయాలు.. 1 ఓటమి.. 12 పాయింట్లు)  అగ్రస్థానంలో ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ (7 మ్యాచులు.. 5 విజయాలు.. 2 ఓటములు.. 10 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ (7 మ్యాచులు.. 5 విజయాలు.. 2 ఓటములు.. 10 పాయింట్లు) మూడో స్థానంలో (ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ కంటే రాజస్తాన్ తక్కువగా ఉంది) నిలిచింది. నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8 మ్యాచులు.. 5 విజయాలు.. 3 ఓటములు.. 10 పాయింట్లు) ఉంది. 

ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఏడు మ్యాచుల్లో నాలుగు గెలిచి (8 పాయింట్లు) ఐదో స్థానంలో నిలువగా ఢిల్లీ క్యాపిటల్స్ అన్నే  ఆడి మూడు  నెగ్గి (6 పాయింట్లు) ఆరో స్థానంలో ఉంది. ఇక  సీజన్ తొలుత వరుస విజయాలతో ఊరించిన  కోల్కతా నైట్ రైడర్స్ (8  మ్యాచుల్లో 3 విజయాలు.. 5 ఓటములు.. 6 పాయింట్లు) ఏడు, పంజాబ్ కింగ్స్ ఏడింట మూడు గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. 7 మ్యాచులాడి 2 మాత్రమే గెలిచింది. దాని స్థానం 9. ఇక ఈ సీజన్ లో అత్యంత చెత్త ఆటతో  అట్టడుగున నిలిచింది ఐపీఎల్ 5 టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. ఆడిన ఏడు   మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా రోహిత్ సేన విజయం సాధించలేదు. 

ప్లేఆఫ్ అవకాశాలు : 

74 మ్యాచులు ముగిసేసరికి  పాయింట్ల పట్టికలో  టాప్-4లో ఉన్న 4  జట్లు ప్లేఆఫ్స్ కు చేరతాయి.  ప్రస్తుతం గుజరాత్ ఆరు విజయాలతో ఉండగా సన్ రైజర్స్, రాజస్తాన్, బెంగళూరు లు 5 విజయాలు సాధించి ఉన్నాయి. గుజరాత్ మరో రెండు మ్యాచులు (ఏడింట్లో) నెగ్గితే  ప్లేఆఫ్స్ కు వెళ్తుంది.  ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ (మరో ఏడు మ్యాచులు ఆడాల్సి ఉంది) ఆర్సీబీ (ఇంకా ఆరు మ్యాచులు ఆడుతుంది) లు మూడు గెలిస్తే చాలు.  లక్నో కూడా పడుతూ లేస్తున్నా  ఆ జట్టుకు కూడా అవకాశం ఉంది.  గతేడాది ఐపీఎల్ రన్నరప్ కేకేఆర్ ఈ సీజన్ లో ప్లేఆఫ్ చేరాలంటే మరో 5 మ్యాచులు (ఇంకా 6 మ్యాచులు) నెగ్గాలి. ఢిల్లీ, పంజాబ్ కూడా అంతే. కానీ ప్రస్తుతం వాటి ఫామ్ చూస్తే డౌటే. 

ఇక చెన్నై విషయానికొస్తే.. తర్వాత ఆడబోయే ప్రతి  మ్యాచ్ నెగ్గాలి. ముంబై ఇండియన్స్ సాంకేతికంగా నిష్క్రమించినట్టే.  ఒకవేళ ముంబై గనక ప్లేఆఫ్ చేరాలంటే  ఇప్పుడు తర్వాత ఆడబోయే ప్రతి మ్యాచ్ భారీ తేడాతో నెగ్గాలి. ఇతర జట్ల విజయాలు, ఓటములు కూడా  కన్నేయాలి.  ప్రస్తుతం అది కష్టమే. 

 

ఆరెంజ్ క్యాప్ : 

అత్యధిక పరుగులు సాధించేవారికి అందించే ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ వద్ద ఉంది.  ఇప్పటికే 7 ఇన్నింగ్స్ లు ఆడిన అతడు.. మూడు సెంచరీలతో 491 పరుగులు చేసి జోరు మీదున్నాడు. అతడి తర్వాత.. హార్ధిక్ పాండ్యా (295), కెఎల్ రాహుల్ (265), ఫాఫ్ డుప్లెసిస్ (255), పృథ్వీ షా (254) ఉన్నారు. 

పర్పుల్ క్యాప్ : 

ఇది కూడా రాజస్తాన్ వద్దే ఉంది.  ఆ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. 7 మ్యాచులలో 18 వికెట్లతో  అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ (15 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (13), డ్వేన్ బ్రావో (12), ఉమేశ్ యాదవ్ (11) ఉన్నారు. 

ఇప్పటివరకు అత్యధిక స్కోరు : రాజస్తాన్ రాయల్స్.. 222/2 (ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్)
అత్యల్ప స్కోరు : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 68 ఆలౌట్ (ప్రత్యర్థి సన్ రైజర్స్ హైదరాబాద్) 

ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు.. 

ఐపీఎల్-15 సగం షెడ్యూల్ పూర్తైన సందర్భంగా బీసీసీఐ ఈ సీజన్ ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు చేసింది.  

- మే 24, 26న తొలి ప్లేఆఫ్స్  (క్వాలిఫైయర్ 1), ఎలిమినేటర్  మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. 
- రెండో ప్లేఆఫ్ మే 27న  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. 
- మే 29న ఫైనల్ ను అహ్మదాబాద్ లోనే నిర్వహిస్తారు.  ఈ మేరకు  బీసీసీఐ తాజాగా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ  నాలుగు మ్యాచులకు స్టేడియాల్లో వంద శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !