IPL 2022: మనల్నెవడ్రా ఆపేది.. విన్ రైజర్స్ ఖాతాలో వరుసగా ఐదో విజయం..

Published : Apr 23, 2022, 10:11 PM IST
IPL 2022: మనల్నెవడ్రా ఆపేది.. విన్ రైజర్స్ ఖాతాలో వరుసగా ఐదో విజయం..

సారాంశం

RCB vs SRH Live Score: ముందు బౌలింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ ను  తక్కువ స్కోరుకే పరిమితం చేసిన హైదరాబాద్.. స్వల్ప లక్ష్యాన్ని 8 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే నష్టపోయి సాధించింది. సీజన్ లో హైదరాబాద్ కు ఇది వరుసగా ఐదో విజయం. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయి ఆడింది.  ముందు బౌలింగ్ తో ప్రత్యర్థి నడ్డి విరిచిన ఎస్ఆర్హెచ్.. తర్వాత బ్యాటింగ్ లో సునాయస లక్ష్యాన్ని 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి బాదేసింది.  ఆర్సీబీ నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని..  ఇంకా 12 ఓవర్లు మిగిలుండగానే ఊదేసింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 47.. 8 ఫోర్లు, 1 సిక్సర్).. బెంగళూరు బౌలర్లను షేక్ ఆడించాడు. హైదరాబాద్ కు ఇది వరుసగా ఐదో విజయం. బెంగళూరుకు 8 మ్యాచుల్లో మూడో పరాజయం.

తాజా విజయంతో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్.. గుజరాత్ తర్వాత రెండో స్థానానికి ఎగబాకింది. గుజరాత్ టైటాన్స్.. (7 మ్యాచులు- 6 విజయాలు-1 ఓటమి.. 12 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ (7 మ్యాచులు- 5 విజయాలు -2 ఓటములు.. 10 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. రాజస్తాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో లు వరుసగా 3,4,5  స్థానాలో ఉన్నాయి. 

స్వల్ప లక్ష్య ఛేదనలో  అభిషేక్ శర్మ బాదుడే మంత్రంగా దూసుకెళ్లాడు. తొలి రెండు ఓవర్లు కాస్త ఓపికపట్టిన అతడు.. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో సిక్సర్, ఫోర్ బాదాడు. తర్వాత హెజిల్వుడ్ బౌలింగ్ లో  రెండు ఫోర్లు కొట్టాడు. ఐదో ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్ లో కూడా అదే రిపీట్ అయింది.  

సన్ రైజర్స్ అభిమానులను ఎక్కువగా వేచి చూడనీయకుండా  మ్యాచ్ ను ముగించాడు అభిషేక్. హెజిల్వుడ్ వేసిన ఆరో ఓవర్లో విలియమ్సన్ (17 బంతుల్లో 16 నాటౌట్.. 2 ఫోర్లు) ఫోర్ కొట్టగా.. అభిషేక్ శర్మ మరోసారి రెండు బౌండరీలు బాది  విజయాన్ని దగ్గర చేశాడు.  అయితే స్కోరు 64 పరుగుల వద్ద (మరో ఐదు పరుగులు  చేస్తే విజయం)  భారీ షాట్ కు యత్నించి.. లాంగాన్ వద్ద ఉన్న అనూజ్ రావత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (7 నాటౌట్) తో కలిసి కేన్ మామ లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..  16.1 ఓవర్లల 68 పరుగులకే కుప్పకూలింది.  ఆర్సీబీ ఆటగాళ్లలో ప్రభుదేశాయ్ (15) టాప్ స్కోరర్. ఆ తర్వాత  రెండంకెల స్కోరు చేసింది  మ్యాక్స్వెల్. అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్ లు డకౌట్ అయ్యారు. డుప్లెసిస్ (5), షాబాజ్ అహ్మద్ (7), హర్షల్ పటేల్ (4), హసరంగ (8) లు అలా వచ్చి ఇలా వెళ్లారు.  సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జాన్సేన్, నటరాజన్ కు 3 వికెట్లు దక్కగా సుచిత్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ తలో వికెట్ దక్కించుకున్నారు. 

సంక్షిప్త స్కోర్లు : 
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :  68 ఆలౌట్ 
- సన్ రైజర్స్ హైదరాబాద్ :  8 ఓవర్లలో  72/1 
ఫలితం : 9 వికెట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు