IPL 2022: అట్లుంటది సన్ రైజర్స్ తోని.. హైదరబాద్ బౌలింగ్ కు బెంబేలెత్తిన బెంగళూరు..

Published : Apr 23, 2022, 09:09 PM ISTUpdated : Apr 23, 2022, 09:28 PM IST
IPL 2022: అట్లుంటది సన్ రైజర్స్ తోని.. హైదరబాద్ బౌలింగ్ కు బెంబేలెత్తిన బెంగళూరు..

సారాంశం

RCB vs SRH Live Updates: వరుసగా నాలుగు విజయాలు సాధించి  దుమ్ముదులుపుతున్న  సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విజయానికి సిద్ధమైంది. నిప్పులు చెరిగే హైదరాబాద్ బౌలింగ్ కు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు బెంబేలెత్తారు. 

డుప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్.. ప్రపంచంలో ఏ బౌలర్ నైనా  తుత్తునీయలు చేసి  మ్యాచ్ ను ఏ క్షణంలో అయినా ద మలుపు తిప్పే బ్యాటర్లు వీళ్లు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో  ఈ నలుగురు చేసిన పరుగులు 17. ఇద్దరు డకౌట్. ఇదొక్కటి చాలు ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ల విధ్వంసం ఏవిధంగా సాగిందో చెప్పడానికి.. మన బౌలర్ల ధాటికి  పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న  బెంగళూరు.. 16.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌట్ అయింది. 

హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు 68 పరుగులకే ఆలౌట్ అయిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోరు చేసిన రెండో జట్టుగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ కి రెండో ఓవర్లోనే ఊహించని షాక్ తగిలింది.  దక్షిణాఫ్రికా యువ సంచలనం  జాన్సేన్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి  బెంగళూరు వికెట్ల పతనాన్ని శాసించాడు. ఆ ఓవర్లో రెండో వికెట్ కు డుప్లెసిస్ (5) ను ఔట్ చేసిన అతడు..  ఆ తర్వాత బంతికే కోహ్లి (0) ని డకౌట్ చేశాడు.  ఆఖరి బంతికి  అనూజ్ రావత్ (0) స్లిప్స్ లో మార్క్రమ్ కు చిక్కాడు. అంతే ఇక ఆర్సీబీ కోలుకోలేదు. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన  గ్లెన్ మ్యాక్స్వెల్ (12) రెండు ఫోర్లు కొట్టి ఉత్సాహంగా కనిపించినా.. అతడి పనిని నట్టూ పట్టాడు.  ఇన్నింగ్స్ 5.2 ఓవర్లో అతడు వేసిన బంతిని మిడాఫ్ దిశగా ఆడాడు మ్యాక్సీ. కానీ అక్కడే ఉన్న  కేన్ మామ ముందుకు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టాడు. 5 ఓవర్లకే  ఆర్సీబీ స్కోరు 25-4. 

ఆదుకుంటారనుకున్న కుర్రాళ్లు ప్రభుదేశాయ్ (15), షాబాజ్ అహ్మద్ (7) లు కూడా తమ సీనియర్లనే అనుసరించారు.  ఇక ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన దినేశ్  కార్తీక్ అయినా వంద పరుగులు చేరుస్తాడని బెంగళూరు అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అతడు కూడా గుండా సున్నాయే.. హర్షల్ పటేల్ (4), వనిందు హసరంగ (8),  మహ్మద్ సిరాజ్ (2) లు కూడా  అదే బాట.  

సన్ రైజర్స్ బౌలర్లలో  జాన్సేన్ బౌలింగే అద్భుతం.  నాలుగు ఓవర్లు వేసిన అతడు.. 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. నటరాజన్.. 3 ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.  సుచిత్ కు రెండు, ఉమ్రాన్ మాలిక్ (4-0-13-1), భువీలకు తలో వికెట్ దక్కాయి.  హైదరాబాద్ బౌలర్ల ధాటికి బెంగళూరులో మ్యాక్స్వెల్ (12), ప్రభుదేశాయ్ (15) మినహా డబుల్ డిజిట్ చేసిన బ్యాటర్ లేడు.  కోహ్లి తో సహా ముగ్గురు డకౌట్ అయ్యారు. ఇక 68 పరుగులకే ఆలౌట్ అయిన ఆర్సీబీ చెత్త రికార్డు నమోదు చేసింది.


ఐపీఎల్ లో అత్యల్ప స్కోర్లు : 

- 2017లో ఆర్సీబీ.. కోల్కతాపై మ్యాచ్ లో 49 పరుగులకే ఆలౌట్ 
- 2009లో రాజస్తాన్ రాయల్స్ .. 58 పరుగులకే ఆలౌట్ 
- 2022 లో ఆర్సీబీ.. సన్ రైజర్స్ పై.. 68 పరుగులకే ఆలౌట్ 

ఐపీఎల్ లో వందకు తక్కువగా స్కోర్లు చేసిన జట్లు.. 

- 9 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ 
- 8 సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
- 6 సార్లు ముంబై ఇండియన్స్

PREV
click me!

Recommended Stories

IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !