
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్ఘానిస్తాన్, మరోసారి రక్తసిక్తం అవుతోంది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో గురువారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వందకి పైగా జనాలు గాయపడ్డారు. కాబూల్ విమానాశ్రయాన్ని కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది...
ఆఫ్ఘాన్‌లో జరుగుతున్న ఈ సంఘటనలతో ఆ దేశ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఆఫ్ఘాన్‌లో జరుగుతున్న సంఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, నిద్ర పట్టడం లేదని కొన్నాళ్ల కిందట పోస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాబూల్ పేలుళ్లపై స్పందించాడు ఈ ఎస్‌ఆర్‌హెచ్ ఆల్‌రౌండర్...
‘కాబూల్ మరోసారి రక్తసిక్తమవుతోంది... ఆఫ్ఘాన్‌ను చంపడం ఆపేయండి ప్లీజ్...’ అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తున్నట్టుగా ఏమోజీలను ట్వీట్ చేశాడు రషీద్ ఖాన్...
అలాగే మరో ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్, ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ మహ్మద్ నబీ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు నేను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా... క్లిష్ట సమయాల్లో ఇలాంటి దాడులను ప్రపంచదేశాల సాయంతో అడ్డుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది...’ అంటూ ట్వీట్ చేశాడు మహ్మద్ నబీ...