వైన్ షాపులు తెరుస్తున్నట్లు నకిలీ జీవోను ప్రచారంలోకి తీసుకుని వచ్చిన యువకుడిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: మద్య దుకాణాలు తెరుస్తున్నారంటూ ప్రచారం చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో అంటూ ఓ దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అతను తప్పుడు ప్రచారం చేసినట్లు గుర్తించారు. దాంతో అతనిపై కేసు నమోదు చేశారు.
నకిలీ జీవోను ప్రచారంలోకి తెచ్చిన వ్యక్తిని ఉప్పల్ లోని విజయపురి కాలనీకి చెందిన శనీష్ కుమార్ గా గుర్తించారు. కరోనా వైరస్ విస్తరిస్తూ లాక్ డౌన్ అమలులో ఉన్న ప్రస్తుత స్థితిలో తప్పుడు ప్రచారం చేసినవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఆరుగురిలో నలుగురు ఢిల్లీలోని ప్రార్థనా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చినవారే. ఇదిలా వుంటే, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిని కరోనా నెగెటివ్ రావడంతో హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
తెలంగాణలో జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కోసం తెలంగాణ ప్రభుత్వం జల్లెడ పడుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని చెక్ పోస్టు వద్ద లోనికి రావడానికి ప్రయత్నించిన 32 మందిని అడ్డుకున్నారు.
వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసేయడంతో పలువురు మతిస్థిమితం కోల్పోయి హైదరాబాదులోని మానసిక చికిత్సాలయానికి చేరుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో మతిస్థిమితం కోల్పోయి ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.