హైద్రాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన 10 మంది ఇండోనేషియన్ మత బోధకుల బృందం సభ్యులు కరోనా నుండి కోలుకొన్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన 10 మంది ఇండోనేషియన్ మత బోధకుల బృందం సభ్యులు కరోనా నుండి కోలుకొన్నారు. వీరిని మంగళవారం నాడు చెస్ట్ ఆసుపత్రి నుండి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే ఇప్పటికిప్పుడే వీరంతా ఇండోనేషియా వెళ్లే పరిస్థితులు లేనందున వారిని క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయం తీసుకొన్నారు వైద్యులు.
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఇండోనేషియా బృందం ఈ నెల మొదటి వారంలో వచ్చారు. ఇండోనేషియా బృందం సభ్యుల రాకతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెల 16వ తేదీన 10 మంది సభ్యుల ఇండోనేషియా బృందం సభ్యులను చికిత్స కోసం కరీంనగర్ నుండి హైద్రాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే.
దీంతో కరీంనగర్ కు వచ్చిన ఇండోనేషియా బృందం సభ్యులను చెస్ట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స నిర్వహించారు. ఇండోనేషియా బృందం సభ్యులందరూ కూడ కరోనా నుండి కోలుకొన్నట్టుగా చెస్ట్ ఆసుపత్రి వైద్యులు మంగళవారం నాడు ప్రకటించారు. అంతేకాదు వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు కేంద్రం లాక్‌డౌన్ విధించింది. ఇప్పటికిప్పుడే వీరంతా ఇండియా వదిలి ఇండోనేషియా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఇండోనేషియా బృందాన్ని తిరిగి క్వారంటైన్ చేయాలని చెస్ట్ ఆసుపత్రి వైద్యులు నిర్ణయం తీసుకొన్నారు.. ఈ బృందంతో ఇండోనేషియా ఎంబసీకి చెందిన ఓ వైద్యుడు కూడ ఉంటాడు.