రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలనుకుంటే అందుకు తగినట్లు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని , లేదంటే ప్రజల్లో అసహనం పెరుగుతుందని రేవంత్ అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలనుకుంటే అందుకు తగినట్లు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని , లేదంటే ప్రజల్లో అసహనం పెరుగుతుందని రేవంత్ అన్నారు.
రాష్ట్రంలోని పేదలు, బస్తీవాసులు, వలస కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు రేవంత్ ఓ ప్రకటన విడుదల చేశారు.
లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కరోనాపై ప్రతిరోజూ ప్రధానితో మాట్లాడుతున్నారని చెబుతున్న సీఎం... మరి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంతో ఎందుకు సంప్రదింపులు జరపడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read:ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సిందే: కేసీఆర్
ప్రైవేట్ వైద్య వ్యవస్థలను ప్రభుత్వం ఎందుకు ఉపయోగించడం లేదని ఆయన నిలదీశారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ప్రతినిధులను ప్రధాని సంప్రదిస్తున్నారని, మరి కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
సోమవారం మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ ఇంకా కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. బతికి ఉంటే బలుసాకు తినవచ్చునని ఆయన అన్నారు.
తాను రోజూ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేస్తే ప్రజలను నియంత్రించగలమా అని ఆయన చెప్పారు. లాక్ డౌన్ కొనసాగించాలని తాను ప్రధానికి సూచించినట్లు ఆయన తెలిపారు .
Also Read:కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటది, జాగ్రత్త: సీఎం హెచ్చరిక
లాక్ డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటుందని, అయితే ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటే కోలుకోవచ్చునని, కరోనా వ్యాపిస్తే కోలుకోవడం కష్టమని ఆయన అన్నారు. లాక్ డౌన్ మాత్రమే మన వద్ద ఉన్న ఆయుధమని, మరో ఆయుధం లేదని ఆయన అన్నారు.
లాక్ డౌన్ ను ఏప్రిల్ 15వ తేదీన తర్వాత కూడా కొనసాగించాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ జూన్ 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలని సూచించిందని ఆయన చెప్పారు.