పంచాయతీ తరపున బంధువులకు సమాచారం అందించారు. అయితే.. కరోనా భయంతో ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం.
కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎంతలా అంటే.. మనిషి ప్రాణాలు పోతే కనీసం చివరి చూపుకు కూడా ఆ ఇంటి వైపు ఎవరూ చూడటం లేదు. మామూలుగా అయితే... ఎవరి ఇంట్లో అయినా ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకుంటే.. అయినవాళ్లంతా ఒక చోటుకుచేరుకుంటారు.
చుట్టుపక్కల వారు వారికి అండగా నిలుస్తారు. వారి బాధలో పాలు పంచుకొని ఓదార్పునిస్తారు. కరోనా తో ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఓ మహిళ చనిపోతే.. ఆమెను కడసారి చూడటానికి కానీ.. అంతిమ సంస్కారాని కూడా ఎవరూ రాలేదు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చోటుచేసుకుంది.
Also Read హైదరాబాదులో ఐదు రెడ్ జోన్లు ఇవే: ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టొద్దు...
పూర్తి వివరాల్లోకి వెళితే.. ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన కోసరి రాజవ్వ(56) గురువారం సాయంత్రం మృతిచెందింది. దీంతో పంచాయతీ తరపున బంధువులకు సమాచారం అందించారు. అయితే.. కరోనా భయంతో ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం.
గ్రామస్థులు కూడా దగ్గరకు రాలేదు. కనీసం పాడే మోసేందుకు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. దీంతో పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు రిక్షాపై మృతదేహాన్ని స్మశానానికి తరలించారు.