కల్లు తాగడానికి వెళ్లిన ఓ రైతు పోలీసులను చూసి భయపడి పరుగు తీశాడు. దాంతో అతను బావిలో పడ్డాడు. అతన్ని బావిలోంచి బయటకు తీసి వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. లాక్ డౌన్ ను పోలీసులు చాలా కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. ఓ రైతు పోలీసులను చూసి పరిగెత్తి బావిలో పడ్డాడు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో ఓ రైతు కల్లు తాకడానికి తాటి చెట్ల కిందికి వెళ్లాడు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులను చూసి రైతు భయంతో పరుగు తీశాడు. అతను బావిలో పడ్డాడు.
అతన్ని బావి నుంచి బయటకు తీశారు. అయితే, అతని నడుము విరిగినట్లు తెలుస్తోంది. అతన్ని వ్యవసాయం చేసుకుంటూ జీవించే దేవేందర్ గా గుర్తించారు. అతన్ని వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో రోజు రోజుకూ పరిస్థితి దారుణంగా మారుతోంది. తెలంగాణలో తాజాగా బుధవారంనాడు కరోనా వైరస్ సోకి ముగ్గురు మరణించారు. దాంతో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. బుధవారం ఒక్క రోజే కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 127కు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆ విషయాన్ని వెల్లడించారు.
గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోదా ఆస్పత్రిలో ఒకరు బుధవారం మరణించారు. నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినవారికి, వారి వల్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కొత్తగా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.