కేసీఆర్ సర్కార్ కరోనాపై పోరాడేందుకు మరింత సర్వసన్నద్దం అవుతోంది. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను హాస్పిటల్ గా మార్చాలని నిర్ణయించింది.
హైదరాబాద్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో తెలంగాణ సర్కార్ మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ ను పూర్తిగా కరోనా రోగుల చికిత్స కోసమే కేటాయించిన ప్రభుత్వం తాజాగా గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా హాస్పిటల్ గా మార్చాలని నిర్ణయించింది. అందులోభాగంగా అక్కడ ఏర్పాట్లను కూడా ప్రారంభించింది.
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న పనులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. 1500 బెడ్స్ తో కరోనా రోగుల చికిత్సకోసమే దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో అధికారులకు పలు సూచనలు చేశారు. 3 వేల మందికి అవసరం అయిన నీళ్ళ టాంక్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 10 లక్షల లీటర్ల నీరు పట్టే విధంగా సంప్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి నల్లా దానంతట అదే ఆగి పోయేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి బాత్ రూం శుభ్రంగా ఉండాలని... అవసరం అయితే తాత్కాలిక బాత్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనులన్నీ శాశ్వత ప్రాతిపదికన చేయాలని సూచించారు.
మంచి నాణ్యత ఉన్న పరికరాలు మాత్రమే వాడాలన్నారు. బెడ్స్, కాట్స్ శుభ్రంగా ఉండాలని...స్టాఫ్ కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్ద సంస్థలకు కాటరింగ్ ఇవ్వాలని సూచించారు.
సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేయాలని... మూడు రోజుల్లో మూడు ఫ్లోర్ లు, మరో మూడు రోజుల్లో మరో మూడు ఫ్లోర్ లు సిద్ధం చేయాలని ఆదేశించారు. 20 రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు మంత్రికి తెలిపారు.
అయితే ఈ ఏర్పాట్లన్నీ అవసరం పడకపోవచ్చు... కానీ సిద్ధంగా ఉంచాలన్న సీఎం ఆదేశంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఉన్నాయని... వాటిని పట్టించుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యత గా వ్యవహారించాలని... సాధ్యమయిన మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కరోనా ట్రీట్మెంట్ కు సిద్ధమన్నారు.
సైకోలు, శాడిస్టులు పెట్టె వార్తలు ఎవరూ నమ్మొద్దన్నారు. రాష్ట్రంలో ఎలాంటి రెడ్ జోన్ లు లేవన్నారు. పాతబస్తిలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా వచ్చిందని తెలిపారు. కాంటాక్ట్ లేకుండా కరోనా సోకదన్నారు. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసులందరూ ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి ఈటల వెల్లడించారు.