తెలంగాణలో తొలి కరోనా మృతి: మరో ఆరు కేసులు, దేెశంలో మృతులు 21

By telugu team  |  First Published Mar 28, 2020, 6:38 PM IST

తెలంగాణలో తొలి కరోనా మరణం రికార్డయింది. గ్లోబల్ ఆస్పత్రిలో 74 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి మరణించినట్లు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. తాజాగా మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి,


హైదరాబాద్: తెలంగాణలో తొలి కరోనా మరణం సంభవించింది. హైదరాబాదులోని ఖైరతాబాదులో గల గ్లోబల్ ఆస్పత్రిలో 74 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఇతర ఆరోగ్య సమస్యలతో అతను గ్లోబల్ ఆస్పత్రిలో చేరాడని, మరణించిన తర్వాత అతనికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. అతను హైదరాబాదులోని నాంపల్లికి చెందినవాడు. 

వృద్ధుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపారు. తాజాగా తెలంగాణలో మరో ఆరు కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు తెలిపారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 65కు చేరుకుంది. హైదరాబాదులోని పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు.

Latest Videos

కుత్బుల్లాపూర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా వైరస్ సోకినట్లు ఆయన తెలిపారు. ఇలా కుటుంబాల్లోని సభ్యులే కరోనా పాజిటివ్ గా గురవుతున్నట్లు, దానివల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. రెడ్ జోన్లు ఎక్కడా ప్రకటించలేదని ఆయన చెప్పారు. సికింద్రాబాదులోని గాంధీలో గొప్ప వసతులతో ఐసోలేషన్ వార్డులున్నాయని ఆయన చెప్పారు. తాము ఏదీ దాచడం లేదని మంత్రి చెప్పారు. 

కాగా, తెలంగాణలో ఓ మరణం రికార్డు కావడంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 21కి చేరుకుంది. కేరళలో శనివారం ఓ మరణం సంభవించిన విషయం తెలిసిందే. ఒక్క రోజు దేశంలో రెండు మరణాలు సంభవించాయి

కేరళలో తొలి మరణం నమోదైంది. కేరళలోని కొచ్చి ఆస్పత్రిలో 69 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. కేరళలో అత్యధికంగా 176 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో తొలి కరోనా కేసు కూడా కేరళలోనే నమోదైంది. దీంతో భారతదేశంలో కరోనా మరణాల సంఖ్య 20కి పెరిగింది. 

రాష్ట్రాలవారీగా కరోనా మరణాల సంఖ్య ఇలా ఉంది....

తెలంగాణ 1
కేరళ 1
మహారాష్ట్ర 4
కర్ణాటక 3
గుజారత్ 3
ఢిల్లీ 1
తమిళనాడు 1
పంజాబ్ 1
మధ్యప్రదేశ్ 2
జమ్మూ కాశ్మీర్ 1
పశ్చిమ బెంగాల్ 1
చండి గడ్ 1
హిమాచల్ ప్రదేశ్ 1

click me!