ఒకరి మృతి: 23 రోజుల పసికందుకు కరోనా, ఒక్క రోజే 8 పాజిటివ్ కేసులు

By telugu teamFirst Published Apr 7, 2020, 3:13 PM IST
Highlights

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ తో ఓ వ్యక్తి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీహెచ్ఎంవో చెప్పారు. దీంతో గద్వాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది.

గద్వాల: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ తో ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. కాగా, గద్వాలలో ఈ రోజు కొత్తగా 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకుంది. మహబూబ్ నగర్ పట్టణంలో ముగ్గురికి కరోనా సోకింది. వీరంతా మర్కజ్ కు వెళ్లివచ్చినవారే. 23 రోజుల పసికందుకు కూడా కరోనా సోకింది. 

తెలంగాణలో ఇప్పటి వరకు 11 మరణాలు సంభవించాయి. మహబూబ్ నగర్ మరణాన్ని కూడా ధ్రువీకరిస్తే ఆ సంఖ్య 12కు చేరుకుంది. తెలంగాణలో సోమవారంనాటికి 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 45 మంది కోలుకున్నట్లు సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం చెప్పారు. ఇంకా 308 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 

ఇదిలావుంటే, కరోనా వైరస్‌ను మోసుకొచ్చిన ఇండేనేషియన్లపై కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. క్రైం నెంబర్ 108/2020.. ఐపీసీ సెక్షన్ 420, 269, 270, 188ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎపడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 సోక్షన్ 3, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు 2005 సెక్షన్ 51 బి, ఫారినర్స్ యాక్ట్ 1947 సెక్షన్ 14 (1) (బి), 7,13, 14(సి) ల ప్రకారం వన్ టౌన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది.

కరీంనగర్ లో పర్యటించిన 10 మంది ఇండోనేషియా దేశస్థులు, వారికి గైడ్లుగా వ్యవరించిన ఇద్దరు, స్థానికంగా ఆశ్రయం కల్పించిన వారిపై కూడా వన్ టౌన్ పోలీసుస్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వారు సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో రామగుండం వచ్చారు. రామగుండం నుంచి ఆటోలో కరీంనగర్ వచ్చారు. 

click me!