కరీంనగర్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు: కలెక్టర్ అలర్ట్

By telugu teamFirst Published Mar 30, 2020, 8:23 PM IST
Highlights

కరీంనగర్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇండోనేషియా నుంచి వచ్చినవారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తి కుటుంబంలోని ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ మధ్య ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు అశ్రయం ఇచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

కరీంనగర్ బాధితుడి సోదరికి, తల్లికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. బాధితుడి కుటుంబంలో మొత్తం ఏడుగురు సభ్యులున్నారు. అయితే, మిగతావారికి ఎవరికి కూడా కరోనా సోకలేదని సమాచారం. ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక ధ్రువీకరించారు. 

బాధితుడి కుటుంబ సభ్యులను సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇళ్లలోంచి ఎవరు కూడా బయటకు రావద్దని ఆయన ఆదేశించారు. 622 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని శశాంక తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ క్వారంటైన్ లో 35 మంది, చల్మెడ ఆసుపత్రిలో 49 మంది ఉన్నారని చెప్పారు. .

మరో ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ లో ఉన్నారని అన్నారు. జిల్లాలో 14995 మంది వలస కూలీలు ఉన్నారని అన్నారు. వలస కూలీలకు ఒక్కొక్కరికి 500 రూపాయల నగదు, 12 కిలోల బియ్యం రేపు సాయంత్రం లోగా పంపిణీ చేస్తామని అన్నారు.

కరీంనగర్ లోని ముకురంపురా ప్రాంతంలో మరోసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్తారని శశాంక చెప్పారు. మురంపుర ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి కి హెల్త్  స్క్రీనింగ్ చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి దాకా కరీంనగర్ జిలాల్లో మొత్తం  105 శాంపుల్స్ టెస్ట్ చేశామని, రాష్ట్రంలోనే ఇంతగా టెస్ట్ శాంపుల్స్ చేసిన ప్రాంతం కరీంనగర్ మాత్రమేనని ఆయన అన్నారు. 

తాజా కేసులతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72కు చేరుకుంది. కరోనా వైరస్ సోకి ఓ వృద్ధుడు హైదరాబాదులో మరణించిన విషయం తెలిసిందే. ఇండోనేషియా నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వచ్చినవారి వల్ల కరీంనగర్ ప్రమాదంలో పడింది. అక్కడి నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలగా, వారికి ఆశ్రయం కల్పించిన ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు బయటపడింది.

click me!