కరోనా మహమ్మారిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న విధాన నిర్ణయాలతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఫుల్ ఖుషీ అయ్యింది. మున్ముందు భారతదేశానికి గట్టి మద్దతు అందజేస్తామని ప్రకటించింది
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ అమలు చేస్తున్న విధానపరమైన స్పందన, ఉద్దీపన పథకానికి తాము గట్టి మద్దతు ప్రకటిస్తున్నామని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్న భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విధానాలు బాగున్నాయని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ చాంగ్ యాంగ్ రీ అన్నారు.
‘ప్రజల ప్రాణాలు కాపాడేందుకు భారత్ లాక్‌డౌన్ విధించింది. పేదలు, మధ్యతరగతి వర్గం కోసం ఉద్దీపన పథకం ప్రకటించింది. కరోనా మహమ్మారిపై భారత్ విధాన పరమైన స్పందనకు మేం గట్టి మద్దతు ప్రకటిస్తున్నాం’ అని చాంగ్ యాంగ్ రీ పేర్కొన్నారు.
‘ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేందుకు తీసుకుంటున్న లిక్విడిటీ చర్యలు బాగున్నాయి. మధ్యకాలిక వృద్ధి సాధించేందుకు భారత్ సమగ్ర, సమ్మిళిత సంస్కరణలు చేపట్టాలి. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరగాలి. వైద్య పరికరాలు పెంచుకోవాలి. సిబ్బందికి ఇబ్బందులు రాకుండా చూడాలి’ అని చాంగ్ యాంగ్ రీ అన్నారు.
also read ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం: అమెరికా లోటును తీర్చటం కష్టమే...
‘కొవిడ్-19 ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు చోదకంగా పనిచేసే ఆర్థిక చర్యలు గణనీయంగా చేపట్టాలి. వైరస్ కట్టడి కాగానే రికవరీ మొదలు అవుతుంది. డిమాండ్ వైపు నుంచి చూస్తే ప్రపంచవ్యాప్తంగా మందగమనం సుదీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు.
‘పర్యాటకం సహా కొన్ని రంగాలు వెంటనే కోలుకోవడం కష్టం. సరఫరా వ్యవస్థ, తయారీ, నిర్మాణ రంగాలపై కొవిడ్ ప్రభావం అధికంగా ఉంది. తగినంత లిక్విడిటీ లేకపోవడంతో పెట్టుబడులు తగ్గొచ్చు. వైరస్ మరింతగా విజృంభిస్తే చాలామంది చనిపోతారు. వైద్య వ్యవస్థపై భారం పెరుగుతుంది. నిరుద్యోగం ప్రబలుతుంది. మధ్యకాలిక వృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటే ఉద్యోగాలు సృష్టించొచ్చు’ అని రీ వెల్లడించారు.