కరోనా ఎఫెక్ట్: కుదేలైన నిర్మాణ రంగం... రూ.59 లక్షల కోట్లు హాంఫట్

By Sandra Ashok Kumar  |  First Published Apr 16, 2020, 2:25 PM IST

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా​ మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. అలాగే ఆర్థిక రంగాన్నీ కూడా చిన్నాభిన్నం చేస్తోంది. ఆర్థిక రంగంలో అతి కీలకమైన నిర్మాణ రంగమైతే మహమ్మారి ధాటికి కుదేలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి జరిగిన నష్టానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని విశ్లేషకులు అంటున్నారు.


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థకు మూల ఆధారం అయిన నిర్మాణ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి నష్టాలను నియంత్రించాలని ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ కేపీఎంజీ అభిప్రాయ పడింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.59 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మాణ రంగంలో కొనసాగుతున్నాయి. 45 రోజుల్లో ఈ ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో వీటి పనులు స్తంభించి పోయాయి. 

ప్రస్తుత మారిన పరిస్థితుల్లో ప్రణాళిక ప్రకారం పనులను పూర్తి చేయడంపై ఆయా ప్రాజెక్టుల అధినేతలు ఆశాభావంతో ఉన్నారు. దేశవ్యాప్తంగా 4.9 కోట్ల మంది నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దీనికి అనుబంధంగా 250 పరిశ్రమలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. 

అంతేగాక ఆర్థిక వ్యవస్థను సత్వరం మళ్లీ గాడిలో పెట్టాలంటే ఈ రంగానికి పెద్దపీట వేయాలని తాజాగా కేపీఎంజీ ఓ నివేదికలో సూచించింది. వెంటనే నిలిచిపోయిన ప్రాజెక్టులను మళ్లీ వెంటనే ప్రారంభం అయ్యేందుకు చర్యలు తీసుకోవటంతో పాటు, ఏఏ ప్రాజెక్టులు ముందుగా చేపట్టాలో నిర్దేశించుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరింది.

ఈ రంగంలో ఉన్న మానవ వనరులు, యంత్రసామగ్రికి వెంటనే మళ్లీ పూర్తిస్థాయిలో పని దొరకకపోవచ్చునని కేపీఎంజీ తెలిపింది, అందువల్ల ఆ మిగులు వనరులను వినియోగించుకోవటానికి వీలుగా ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని సూచించింది.

‘కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ నుంచి వచ్చే కొద్ది రోజుల్లో సడలింపు దొరకవచ్చు, ఆ తర్వాత కొంతకాలానికి పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉంది. నిర్మాణ రంగం భాగస్వామ్యం లేకుండా ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం అనేది సాధ్యం కాదు’ అని కేపీఎంజీ తెలిపింది.

‘ప్రస్తుతం నిర్మాణ రంగ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన కార్యాచరణతో నిర్మాణ రంగ కార్యకలాపాలు మొదలుపెట్టి వేగవంతం చేయటానికి పూనుకోవాలి’ అని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది.

also read  కరోనా ఎఫెక్ట్: దివాళాదశలో హోటల్స్ రంగం... మారటోరియం పెంచాలని అభ్యర్థన

దేశవ్యాప్తంగా రూ.59 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటి పైనా కరోనా వైరస్ ప్రభావం చూపింది. దాదాపుగా పనులన్నీ నిలిచిపోయాయి. తత్ఫలితంగా లక్షల మంది కార్మికులకు పని లేకుండా పోయింది. కార్మికులు కొంతమంది స్వస్థలాలకు వెళ్లిపోగా, మరి కొందరు లేబర్‌ క్యాంపుల్లో ఉండిపోయారు.

మనదేశం వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావాలంటే ‘జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక’ కింద నిర్దేశించుకున్న విధంగా భారీ ప్రాజెక్టులను సత్వరం చేపట్టి పూర్తిచేయాలి. నిర్మాణ రంగంలో 4.9 కోట్ల మంది పనిచేస్తున్నారు. మనదేశంలో పని చేసే జనాభాలో ఈ మొత్తం 12 శాతానికి సమానం. అంతేగాక నిర్మాణ రంగంపై దాదాపు 250 రకాలైన అనుబంధ పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ పనులు నిలిచిపోగా, సైట్‌లో ఉన్న కార్మికులు, ఇతర సిబ్బందిని అన్ని రకాలుగా ఆయా ప్రాజెక్టుల యాజమాన్యాలు ఆదుకోవలసి వస్తోంది. ఇది అదనపు భారం కాగా, ఆ మేరకు ప్రాజెక్టు వ్యయాలు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

దేశంలోని అతిపెద్ద నిర్మాణ రంగ కంపెనీ ఒకటి, తన ప్రాజెక్టు సైట్ల వద్ద ఉన్న లేబర్‌ క్యాంపుల్లో దాదాపు 2.30 లక్షల మంది కార్మికుల కనీస అవసరాల కోసం రోజుకు రూ.15 కోట్లు వెచ్చిస్తోంది. ఓసారి వర్షాకాలం మొదలైతే నిర్మాణ పనులు చేపట్టటం అసాధ్యం. అంటే జూన్‌ నెలాఖరు వరకే గడువు. అందువల్ల వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితులు కల్పిస్తే, కొంత మేరకు నష్టాన్ని పూడ్చుకున్నట్లు అవుతుంది.

ఆరోగ్య పరమైన సవాళ్లు తలెత్తకుండా నిర్మాణ పనుల్లోకి కార్మికులను పూర్తిస్థాయిలో తీసుకు వచ్చేందుకు, అందుకు తగిన విధివిధానాలను నిర్దేశించుకునేందుకు ఇదే సరైన తరుణమని కేపీఎంజీ ఇండియా పార్టనర్‌ అండ్‌ లీడర్‌ చింతన్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. 

లాక్‌డౌన్‌ పూర్తై నిర్మాణ ప్రాజెక్టులు మొదలు పెట్టే సమయానికి కార్మికులు స్వస్థలాల నుంచి పూర్తిస్థాయిలో రాకపోవచ్చని, మూలధన లభ్యత కూడా సమస్య అవుతుందని, అందువల్ల దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టాలని ఈ నివేదిక అభిప్రాయపడింది. 

ఆఫ్‌-సైట్‌, మాడ్యులార్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, ప్రీ-కాస్ట్‌ స్ట్రక్చర్‌ పద్ధతులకు పెద్దపీట వేయాలని, తద్వారా నిర్మాణాల వేగం పెరుగుతుందన్నది. ప్రాజెక్టుల నిర్వహణలో ఎదురయ్యే అవరోధాలను గుర్తించాలని, సమర్థవంతమైన ప్రాజెక్టు యాజమాన్య విధానాలను ఎంపిక చేసుకొని నష్టాలను నివారించాలని కేపీఎంజీ వివరించింది.

click me!