బాపట్లలో యువకుడి ఆత్మహత్యపై ఏపి డిజిపి సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై విచారణకు ఆదేశించారు.
ప్రకాశం జిల్లా బాపట్లలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్లోనే చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు ముందు సదరు యువకుడు తీసుకున్న సెల్పీ వీడియో సంచలనంగా మారింది. ఈ ఘటనలో పోలీసుల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో డిజిపి గౌతమ్ సవాంగ్ స్పందించారు.
బాపట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువకుడు అత్మహత్య చేసుకోవడంపై రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తలపై స్పందించిన డీజీపీ తక్షణమే ఈ సంఘటన పై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆదేశించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బాపట్లలో దీని కారణంగా శ్రీనివాస్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చిత్తూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించడంతో అతను కృష్ణా జిల్లాలోని తన స్వస్థలానికి బైక్ పై బయలుదేరాడు. అయితే బాపట్లలో అతని బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతను తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సెల్ఫీ రికార్డు చేశాడు. తన ఆత్మహత్యకు పోలీసులను నిందించాడు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బాపట్లలో తనను పోలీసులు నిలిపేసి బైక్ ను స్వాధీనం చేసుకున్నారని, ఆ తర్వాత తనను బాపట్ల బస్ స్టాండులో వదిలేశారని అతను చెప్పాడు. పోలీసులు బాధ్యత లేకుండా వ్యవహరించారని అతను విమర్శించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గురువారంనాడు గత 9 గంటల వ్యవధిలో మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ రోజు కొత్తగా 32 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి వల్ల వారి కుటుంబ సభ్యులకు ఇతరులకు పాకుతోంది.