ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. విజయవాడకు చెందిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. రాష్ట్రంలో 149 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా మరణం రికార్డయింది. విజయవాడలో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన వ్యక్తి మరణించాడు. విజయవాడలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడలోని భవానీపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. సాయంత్రమే 143 గా ఉన్న కరోనా కేసులకు తోడుగా మరో 6 కేసులు జత కూడాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య 149కి చేరింది. మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో గనుక తీసుకుంటే... 154 కేసులు నమోదయినప్పటికీ వారిలో 9 మంది మరణించగా 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. దానితో తెలంగాణలో ఇప్పుడు ఆక్టివ్ కేసుల సంఖ్య 128 మాత్రమే!
జిల్లాలవారీగా గనుక తీసుకుంటే... నెల్లూరు లో అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయి. ఆతరువాతి స్థానాల్లో 23 కేసులతో కృష్ణ, 20 కేసులతో గుంటూరు జిల్లాలు ఉన్నాయి. సీఎం సొంత జిల్లా కడప 18 కేసులతో ఆ తరువాతి స్థానంలో కొనసాగుతోంది.
ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం లలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. రాష్ట్రంలో ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదవ్వడానికి ప్రధాన కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన ప్రార్థనలు అని తెలియవస్తుంది.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి వల్ల వారి కుటుంబ సభ్యులకు ఇతరులకు పాకుతోంది. ఢిల్లీ నుంచి 1085 మంది తిరిగి రాగా, వారిలో 758 మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. కడప, గుంటూరు, విశాఖల్లో మూడు ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాంపిల్స్ పరీక్షల సామర్థ్యం 450 నుంచి 570కి పెరుగుతుంది.
ఇతర రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువగా కేసులు నమోదయ్యాయి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా ముప్పు పెద్దగా ఉండకపోవచ్చునని భావించారు. అయితే, నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చినవారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.