కరోనా మహమ్మారిని అరికట్టి ఏపి ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే ఎన్నికలే తనకు ముఖ్యమన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిలపై మరోసారి సోషల్ మీడియా వేదికన టిడిపి అధికార ప్రతినిది, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తోంటే వైసిపి ప్రభుత్వం దాన్ని అరికట్టేందుకు సీరియస్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. జగన్ కాలుపెట్టినప్పటి నుండి రాష్ట్రం అతలాకుతలం అవుతోందని వెంకన్న విమర్శించారు.
''విపత్తు వచ్చినా నాకు ఎన్నికలే ముఖ్యం అన్నాడు. ప్రజలు ఎలా పోతే నాకు ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అన్నాడు. కరోనా వస్తుంది తుగ్లక్ గారు అంటే పేరాసిట్మాల్ వేస్కో, బ్లీచింగ్ చల్లుకో అని ఉచిత సలహా ఇచ్చాడు'' అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను వెంకన్న ఎద్దేవా చేశారు.
''పబ్లిసిటీ పిచ్చి పిక్స్ కి వెళ్లి అసలు టెస్టులు చెయ్యకుండానే బ్రిటన్, అమెరికా తుగ్లక్ ని ఆదర్శంగా తీసుకున్నాయి అని డప్పు కొట్టిస్తున్నాడు'' అని ఆరోపించారు.
''కరోనా లో కూడా తుగ్లక్ కక్కుర్తి బుద్ధి మారలేదు. కేజీ కందిపప్పు లో 250 గ్రాములు దొబ్బి ప్యాకెట్ కి పిన్నులు కొడుతున్నారు. ఆఖరికి బ్లీచింగ్ పౌడర్ కూడా నొక్కేసి దొంగ బిల్లులు రాస్తున్నారు'' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
''పబ్జీ రెడ్డి పాదంతో రాష్ట్రంలో దరిద్రం తాండవిస్తుంది. చరిత్రలో ప్రజలు ఎప్పుడూ చూడనన్ని కష్టాలు చూస్తున్నారు. రైతాంగం సంక్సోభంలో ఉంది. ఇసుక కుత్రిమ కొరత సృష్టించి 70 మంది భవన నిర్మాణ కార్మికులను మింగేసాడు'' అంటూ వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.
''రైతులకు విత్తనాలు,ఎరువులు ఆఖరికి సాగు నీరు ఇవ్వలేక 500 మంది రైతులను బలి తీసుకున్నాడు. మూడు ముక్కలాట మొదలెట్టి 60 మంది రైతుల గుండెలు ఆగడానికి కారణం అయ్యాడు. నిర్లక్ష్యంతో కచ్చులూరు బోటు ప్రమాదంలో 56 మందిని జల సమాధి చేసాడు'' మండిపడ్డారు.
''ఇప్పుడు ఆయన పాదం ఎఫెక్ట్ తో ప్రసిద్ధి దేవాలయాలను సైతం ప్రజలు దర్శించుకోలేని పరిస్థితి. కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికలే ముద్దు అని నిర్లక్ష్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. ఇలాంటి లెగ్ నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ ఎంపీ విజయసాయి రెడ్డి గారు. విత్తనాలు,ఎరువులు ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు రైతు రాజ్యం తెస్తా అన్నట్టు ఉంది'' అని విమర్శించారు.
''వైఎస్ జగన్ గారి పాలన. ఏడాదిలో 500 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు.ఏడాదికి రైతుకు లక్ష రూపాయిలు లబ్ది కల్పిస్తాం అని గాలి హామీలు ఇచ్చారు'' అని అన్నారు.
''ఆఖరికి 12500 రైతు భరోసా అని 5 వేలు కోత పెట్టి 7,500 ఇస్తున్నారు.ఆఖరికి కరోనా దెబ్బకి రైతన్న కన్నీరు పెడుతుంటే ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి పొగడ్తలు తప్ప రైతుని పట్టించుకోవడానికి క్షణం తీరిక లేదు పబ్జీ రెడ్డికి'' అంటూ జగన్, విజయసాయి లపై బుద్దా వెంకన్న మండిపడ్డారు.