తిరుమలలో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. బాలాజీనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలలో కరోనా కలకలం చెలరేగింది. తిరుమలలోని బాలాజీనగర్ లో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. దీంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా పద్మావతి నిలయంలో క్వారంటైన్ చేశారు. ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.
యువకుడు పంజాబ్ నుంచి తిరుమలకు మార్చి 18వ తేదీన ఇక్కడికి వచ్చాడు. అతనికి జ్వరం రావడంతో క్వారంటైన్ కు తరలించి, నమూనాలను పరీక్షలకు పంపించారు. అతను ఎవరెవరిని కలిశాడనే విషయాన్ని ఆరా తీశారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 14 మదికి కరోనా వైరస్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 58కి చేరుకుంది.
ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఉండి, గుండుగొలను, అకివీడు, నారాయణపురంల్లో ఒక్కో కేసు చొప్పున బయటపడింది. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఆ విషయం వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 14 మందికి కోవిద్ 19 ఉన్నట్లు ఈ వైద్యపరీక్షల్లో తేలిందని చెప్పారు. పది మందికి నెగెటివ్ వచ్చిందని, మరో ఆరుగురికి సంబంధించిన పరీక్షల నివేదికలు రావాల్సి ఉదని ఆయన చెప్పారు. నిన్న మరకో నాలుగు కేసులు కూడా బయటపడ్డాయి. ఈ నాలుగు కేసులు కూడా విశాఖపట్నంలోనే నమోదయ్యాయి.