లాక్ డౌన్ ఎఫెక్ట్: సొంతంగా మద్యం తయారీ, తాగి ఒకరు మృతి

By telugu team  |  First Published Apr 1, 2020, 8:34 AM IST

ఆరుగురు యువకులు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలంలో సొంతంగా మద్యం తయారు చేసుకుని సేవించారు. అది సేవించిన ఓ యువకుడు మరణించగా, మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.


ఏలూరు: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా మందుబాబులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఇబ్బందులను అధిగమించడానికి కొంత మంది యువకులు చేసిన ప్రయత్నం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఆరుగురు మిత్రులు కలిసి మద్యం తయారు చేసుకున్నారు. 

అది సేవించి ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో చోటు చేసుకుంది. వైల్పూరుకు చెందిన ధర్నల నవీన్ మూర్తి (22), అల్లాడి వెంకటేష్, కావలిపురానికి చెందిన పండూరి వీరేశ్, తణుకు దుర్గారావు, వెంకట దుర్గప్రసాద్, విప్పర్తి శ్యాంసుందర్ ఆదివారం విందు చేసుకుందామని అనుకున్నారు. 

Latest Videos

ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, దానిలో గ్లిజరిన్, హైడ్రో పెరాక్సైడ్ కలిపి మందు తయారు చేశారు ఆదివారం రాత్రి వారంతా దాన్ని సేవించారు. ఆ తర్వాత తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి నవీన్ కు కడుపులో నొప్పి ప్రారంభమైంది. అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతను సోమవారం రాత్రి మరణించాడు. 

ఇదిలావుంటే, అదే ద్రావణం తాగిన వీరేష్, వెంకటేశ్ లు కూడా కడుపు నొప్పితో మంగళవారం రాత్రి తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

click me!