కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయం అభినందనీయం: పవన్ కల్యాణ్

By Arun Kumar P  |  First Published Mar 27, 2020, 8:04 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో సామాన్యులకు ఊరట కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. 


కరోనా మహమ్మారి మూలంగా తలెత్తిన సంక్షోభ సమయంలో ప్రజలకు నెలవారీ ఈఎంఐల నుంచి ఉపశమనం కలిగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్.బి.ఐ. గవర్నర్ కు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు. కరోనా మహమ్మారిపై సమయంలో సామాన్యులకు వెసులుబాటు  కల్పిస్తూ ఆర్బిఐ గవర్నర్ తాజాగా చేసిన ప్రకటనపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

మూడు నెలల పాటు తాత్కాలిక మారటోరియమ్ అమలు చేసేందుకు అన్ని బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అనుమతించడం, వర్కింగ్ క్యాపిటల్ కు సంబంధించి వడ్డీ చెల్లింపుపై మూడు నెలలు వాయిదా వేయడానికి అనుమతి ఇవ్వడం అనేది ఎంతో ఉపశమనం ఇస్తుందన్నారు. ఈ నిర్ణయం కచ్చితంగా సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ సంక్షోభాన్ని తట్టుకోవటానికి సహాయపడుతుందన్నారు.

Latest Videos

“కోవిడ్-19 అరుదైన మహమ్మారి. ప్రభుత్వాలు మాత్రమే రాష్ట్రాలు / దేశాన్ని లేదా ప్రపంచాన్ని రక్షించలేవు. ఒక మార్గం ఉంది .. మీరు ఒక వ్యక్తి కావచ్చు... చిన్న మధ్యతరహా పరిశ్రమ కలిగినవారో ఒక ప్రభుత్వ రంగ సంస్థ వారో, బహుళ జాతి సంస్థకు చెందినవారో అయితే దయ చేసి మీ ఉద్యోగులను మూడు నెలలపాటు జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఉద్యోగుల కుటుంబాలు ఆకలితో బాధపడకుండా చూడండి.” అని పవన్ కల్యాణ్ సూచించారు.

తెలంగాణ నుంచి వచ్చేవారిని అనుమతించడంపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పవన్ కల్యాణ్  స్పందించారు. “తెలంగాణ రాష్ట్రం ఎన్.ఓ.సి.లతో ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చేవారిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం హైదరాబాద్ నగరంలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువతకు ఊరట కలిగిస్తుంది. వారి ఆందోళనను అర్థం చేసుకున్న హైకోర్టుకు ధన్యవాదాలు. అనుమతించడంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలి. 

అవసరమైన వారిని క్వారంటైన్, లేనివారిని హోమ్ క్వారంటైన్ చేయాలనే ఆ ఆదేశాలను ఏపీకి వస్తున్నవారు బాధ్యతతో గౌరవించాలి. హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, యువత, అక్కడ చిక్కుకుపోయినవారి బాధకు స్పందించి పిటీషన్ దాఖలు చేసిన బీజేపీ నేత వెలగపూడి గోపాల కృష్ణ గారికి అభినందనలు” అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
 

click me!