కరోనా కాదు ఖాకీలు: సామాన్యులపై పోలీసుల ప్రతాపం... యువకుడి మృతి

By Arun Kumar P  |  First Published Mar 27, 2020, 5:16 PM IST

కరోనా భయంతో కాదు... ఆ పేరుతో పోలీసులు  సామాన్యులపై చూపిస్తున్న ప్రతాపాన్ని చూసి ఓ యువకుడు ప్రమాదాన్ని కొనితెచ్చుకుని ప్రాణాలు కోల్పోయిన సంఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 


కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ ను నిరోధించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ చేపట్టినప్పటి నుండి  పోలీసులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారు.  నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ  దాడులను చూసి  భయపడిపోయిన ఓ యువకుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయిన విషాదం కర్నూల్ లో చోటుచేసుకుంది. 

కరోనా వైరస్ ను అరికట్టేందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో స్వచ్చందంగా లాక్ డౌన్ చేపట్టిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ప్రజలు తమ ఇండ్లలోనే ఉండాలని... బయట గుంపులు గుంపులుగా ఉండకూడదని ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు విధించారు. తమ ఆజ్ఞను లెక్కచేయకుండా బయట తిరుగుతున్న వారిపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. తప్పున్నా... లేకపోయినా బయట కనిపిస్తే చాలు విచక్షణను కోల్పోయి సామాన్యులపై దాడులకు పాల్పడుతున్నారు. 

Latest Videos

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి లాక్ డౌన్ లో భాగంగా పెద్ద హరివాణం గ్రామంలో  పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఇళ్లలో నుండి బయటికి వచ్చిన కొందరు యువకులను లోపలికి వెళ్లాలి అంటూ హెచ్చరించారు.  దీంతో భయపడిపోయిన వీరభద్ర స్వామి (30) అనే యువకుడు ఇంటికి పరిగెడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. 

అతడి తలకు బలమైన దెబ్బ తగలడంతో హాస్పిటల్ కు తరలించబోతుండగానే మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆదోని తహశీల్దార్ రామకృష్ణ మృతుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వపరంగా వర్తించే పథకాలను తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. 

click me!