కరోనాపై పోరాటం... వారికి మనస్పూర్తిగా అభినందనలు: దేవినేని ఉమా

By Arun Kumar P  |  First Published Apr 1, 2020, 7:48 PM IST

కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం పోరాడుతున్న సిబ్బందికి మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశంసించారు.


విజయవాడ: రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దిగజారిందని... మామిడి, మొక్కజోన్న, మిర్చి, దాన్యం, టమాటా, రైతులను ఏ విధంగా ఆదుకుంటారో సమాధానం చెప్పాలని సీఎం జగన్ ను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిలదీశారు. బుధవారం నాడు మైలవరం నియోజకవర్గంలో మైలవరం మార్కెట్ యార్డు, రైతుబజార్ ను సందర్శించారు. 

రెడ్డిగూడెం మండలం పాత నాగులురులోని మామిడి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జి.కొండూరు మండలం వెలగలేరు కందుల పాడు గ్రామాలలో ఇబ్బందులు పడుతున్న దాన్యం మిర్చి రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వీయ నియంత్రణ పాటించి, కలిసికట్టుగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదామని స్థానికులకు సూచించారు. 

Latest Videos

హార్టీకల్చర్‌, అగ్రికల్చర్ మార్కెటింగ్ రంగంలో ఉన్న రైతుల కష్టాలు వర్ణనాతీతమని, కూలీలు, గిట్టుబాటు ధర లేక వరి పండించిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. లాక్‌ డౌన్ లో పండించిన పంటను ఏం చేయాలో అర్థంకాక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో వున్నారన్నారు. ధాన్యాన్ని వేరే ప్రాంతాలకు తరలించేందుకు రవాణా సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు పడుతూ దళారుల చేతిలో రైతులు పూర్తిగా మోసపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని... సంబంధిత మంత్రులు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. 

ఏపిలో సార్వా పంట ధాన్యమే ఇంత వరకు పూర్తిగా కొనుగోలు చేయలేదని... కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని అన్నారు.  ధాన్యం రైతుల అవస్థలు మంత్రి కొడాలి నానికి కనపడటం లేదా?  దాళ్వా చేతికొచ్చిన తరుణంలో ఎక్కడ గోదాములు ఖాళీగా ఉన్నాయో సంబంధిత మంత్రి 
నానికి తెలుసా ? అని ప్రశ్నించారు. 

రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ పబ్జీ గేములాడుకుంటున్నాడని... మంత్రి కొడాలి నాని పత్తా లేడని అన్నారు. తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియని అసమర్థుడు బూతుల మంత్రి నాని అని... రేషన్‌ షాపుల్లో రేషన్‌ ఇస్తామని ఆ శాఖ ప్రకటిస్తే మంత్రి ఇంటికే సరుకులు పంపుతామని ప్రకటించి ఆఖరికి ప్రజల్ని క్యూ లైన్లలో నిలబెట్టి ప్రాణాలు తీస్తున్నారన్నారు. 

మైలవరం పరిసర ప్రాంతాలు చండ్రగూడెం తదితర గ్రామాల్లో నెలకు రూ.20కోట్ల ఆదాయం మల్లెపంటపై వస్తుంటే మహమ్మారి కరోనా కారణంగా ఇప్పుడాపరిస్థితులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. బూతులు తిట్టడానికే కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చినట్లుందని ధాన్యం రైతుల సమస్యలు పట్టని మంత్రి రైతులకు ఏం సమాధానం చెప్తారని పేర్కొన్నారు. 

దేశం జాతీయ విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో కుటుంబాలను వదిలి ప్రజా రక్షణ కోసం పోలీసులు, వైద్యులు, అధికారులు, పారిశుద్ధ కార్మికులు, మీడియా ప్రతినిధులు ప్రజలకు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని... ప్రజల తరపున వారికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు దేవినేని ఉమ తెలిపారు.

click me!