బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితులు 111కు పెరిగారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం మినహా రాష్ట్రమంతా కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి అటు ప్రపంచాన్ని ఇటు మన భారత దేశాన్ని వణికిస్తోంది. ఇన్ని రోజులు ఈ వైరస్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ కి ఒకింత ముప్పు తక్కువగానే ఉంది అంతా భావించాం.
కానీ ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి హాజరయి వచ్చినవారితో ఒక్కసారిగా లెక్కలన్నీ తారుమారయ్యాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితులు 111కు పెరిగారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం మినహా రాష్ట్రమంతా కరోనా కేసులు నమోదయ్యాయి.
అందుకు తగ్గట్టుగానే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన సుమారు 30వేల మందిని గుర్తించి వారిని పరీక్షించి క్వారంటైన్ లో ఉంచి రకరకాల చర్యల వల్ల ఆ ముప్పును సాధ్యమైనంత మేర తగ్గించగలిగాము. అలా విదేశాల నుంచి వచ్చినవారిలో కేవలం 16 మందికి మాత్రమే కరోనా సోకింది. వారికి చికిత్స అందిస్తుండడంతో అంతా ఇక కరోనా సమస్య సద్దుమణిగినట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఈ నిజాముద్దీన్ బాంబు పేలింది.
ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ లో ప్రార్థనలకు అటెండ్ అయినా వారిలో చాలామంది కరోనా పాజిటివ్ గా తేలడంతో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వారిని వెదికి క్వారంటైన్ కి తరలించే పనిలో పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సుమారు 1,500మంది ఢిల్లీ వెళ్లి వచ్చారని అంచన. వీరిలో ఇప్పటికే 1,085 మందిని క్వారంటైన్‌కు తరలించారు. మిగిలినవారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణతో ఈ కరోనా కేసుల విషయంలో పోటీ పడుతోంది. కేవలం 24గంటల వ్యవధిలోనే 88 కొత్త కేసులు నమోదవగా, వీరిలో ఢిల్లీ లో తబ్లీఘి జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నారు.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో కేసుల సంఖ్య15కు పెరిగింది. కృష్ణాజిల్లాలో నమోదయిన కేసులన్నీ కూడా విజయవాడలో నమోదయినవే!
మొన్నటివరకు ఒక్క కేసు కూడా నమోదవని సీఎం సొంత జిల్లా కడపలో ఏకబిగిన 15కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 14కేసులు నమోదయ్యాయి. వీరంతా కూడా ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చినవారు, వారి బంధువులే!
తూర్పుగోదావరిలో కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. చిత్తూరు జిల్లాలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. నెల్లూరు జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.