రెడ్ జోన్ గా నెల్లూరు జిల్లా... టాస్క్ ఫోర్స్ తో మేకపాటి కీలక సమావేశం

By Arun Kumar PFirst Published Apr 6, 2020, 12:51 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలో రోజురోజుకు కరోనాకేసులు పెరుగుతుండటంతో ఆ జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించారు. 

అమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్ లో విజృంభిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ సంబంధిత మంత్రులు ఈ వైరస్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఇలా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కూడా కరోనా వైరస్ విషయంలో రెడ్ జిల్లా జాబితాలో ఉండడంతో  నియంత్రణ చర్యలపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దృష్టి పెట్టారు.

సోమవారం పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు, జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు  చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రజలకు కావల్సిన నిత్యావసర సరుకుల ఏర్పాటు, కరోనా కట్టడికి కావాల్సిన అత్యవసర వైద్య సామాగ్రీ సరఫరా అంశాలపై చర్చించారు. జిల్లా లో హాట్ స్పాట్ లను గుర్తించి కోవిడ్ -19  వైరస్ ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ ను ఆదేశించారు. 

రోజురోజుకు జిల్లాలో పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని.... వీటిని తగ్గించేందుకు అత్యవసర క్వారంటైన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.  రాములు నెల్లూరు జిల్లాను కరోనా రహితంగా తయారుచేయాల్సిన బాధ్యత అధికారులపైనే కాదు ప్రజలపైనా వుందని మంత్రి పేర్కొన్నారు. 

click me!