కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికే రాష్ట్రాన్ని లాక్ ఔట్ చేశామని... దాన్ని ఉద్దేశ్యాన్ని నీరుగార్చే విధంగా ప్రజలెవ్వరూ వ్యవహరించకూడదని డిజిపి సవాంగ్ సూచించారు.
అమరావతి: లాక్ అవుట్ ఉదేశ్యమే ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అంటు వ్యాధి సంక్రమించకండా ఉండేలాగా చేయడమేనని ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.
బయట ప్రాంతాల నుండి రాష్ట్రంలోకి అనుమతించడం ఈ లాక్ అవుట్ ఉద్దేశ్యాన్ని నీరు గారుస్తుందని... కాబట్టి ప్రతిఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాలని డిజిపి అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను జాతీయ విపత్తు గా ప్రకటించిందని గుర్తుచేశారు. అందువల్లే ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా... కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని దేశ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చేతులు జోడించి ప్రజలందరిని కోరారని అన్నారు.
ఇదిలా ఉండగా నిన్నటి నుండి కొందరు నిబంధనలకు విరుద్దంగా ఆంధ్ర ప్రదేశ్ లోనికి రావడానికి ప్రయత్నిస్తున్నారని... సరిహద్దు తనిఖీ కేంద్రాల దగ్గరకు వచ్చి ఉన్నారని అన్నారు. అయితే అట్టి వ్యక్తులను నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోనికి అనుమతించేది లేదని అన్నారు.
బోర్డర్ వద్దకు వచ్చిన వారికి నిబంధనల మేరకు ఖచ్చితంగా రెండు వారాలపాటు క్వారంటైన్ నిర్వహించిన తరువాతే రాష్ట్రం లోకి అనుమతిస్తామని డిజిపి సవాంగ్ వెల్లడించారు.