కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ బాపట్లలో యువకుడి ప్రాణం తీసింది. తన బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో అతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా బాపట్లలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బాపట్లలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
అతను చిత్తూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ ప్రకటించడంతో అతను కృష్ణా జిల్లాలోని తన స్వస్థలానికి బైక్ పై బయలుదేరాడు. అయితే, బాపట్లలో అతని బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతను తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సెల్ఫీ రికార్డు చేశాడు. తన ఆత్మహత్యకు పోలీసులను నిందించాడు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బాపట్లలో తనను పోలీసులు నిలిపేసి బైక్ ను స్వాధీనం చేసుకున్నారని, ఆ తర్వాత తనను బాపట్ల బస్సు స్టాండులో వదిలేశారని అతను చెప్పాడు. పోలీసులు బాధ్యత లేకుండా వ్యవహరించారని అతను విమర్శించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గురువారంనాడు గత 9 గంటల వ్యవధిలో మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ రోజు కొత్తగా 32 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి వల్ల వారి కుటుంబ సభ్యులకు ఇతరులకు పాకుతోంది.