ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నాడు ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కు చేరుకొంది. ఈ 161 పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో ప్రార్థనలకు వెళ్లివచ్చినవారిలో 140 పాజిటివ్ కేసులు కావడం గమనార్హం..
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నాడు ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కు చేరుకొంది. ఈ 161 పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో ప్రార్థనలకు వెళ్లివచ్చినవారిలో 140 మందికి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం... నాలుగు రోజుల వరకు ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నామమాత్రంగా ఉన్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన వారి నుండి ఈ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీ మర్కజ్ ప్రాంతానికి 1085 మంది ప్రార్థనలకు వెళ్లారు.వీరిలో 881 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 108 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలింది. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు 613 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో మరో 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ నుండి వచ్చిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు లేదా సన్నిహితులతో కలిపితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 140కి చేరుకొంది.
Also read:ఏపీపై కరోనా దెబ్బ: కొత్తగా 12 కేసులు, మొత్తం కేసులు 161కి చేరిక
రాష్ట్రానికి విదేశాల నుండి 28 వేలకు పైగా వచ్చారు. విదేశాల నుండి వచ్చిన వారి నుండి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు నమోదైన కేసులు అతి తక్కువగా ఉన్నాయి. ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారి నుండి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకొంది.
ఢిల్లీ నుండి వచ్చిన వారితో పాటు వారి ట్రావెల్ హిస్టరీపై ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన వారు స్వచ్చంధంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కూడ ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలోని నాలుగు చోట్ల కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైన ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడ ప్రత్యేక ఆసుపత్రులను ప్రభుత్వం సిద్దం చేసింది.