వచ్చే జూన్ నాటికి ఎయిర్‌ ఇండియా మూసివేత...

By Sandra Ashok KumarFirst Published Dec 31, 2019, 12:49 PM IST
Highlights

ఎయిరిండియా మనుగడ ప్రశ్నార్థకం అవుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఆ సంస్థ వర్గాలు. గతంలో మొత్తం సంస్థ విక్రయానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ విడిగా వాటాల విక్రయానికి కేంద్రం చర్యలు చేపట్టింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలమైతే జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాదిరిగానే ఎయిరిండియా హ్యాంగర్లకే పరిమితం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 
 

ముంబై: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ ఇండియాను కొనేవారు ముందుకు రాకపోతే వచ్చే జూన్‌నాటికి దీని సర్వీసులను నిలిపివేయాల్సి రావొచ్చని సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు. అత్తెసరు నిధులతో ఈ సంస్థ నెట్టుకువస్తోందని, దీర్ఘకాలం ఇది కొనసాగడం కష్టమని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌ ఇండియా భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఎయిరిండియాపై రూ.60,000 కోట్ల అప్పుల భారం ఉంది. సంస్థ వాటాల విక్రయానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడ కోసం ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాకు చెందిన డజన్ న్యారో బాడీ విమానాలు నేలకే పరిమితమ్యాయి. వీటి కార్యకలాపాలు ప్రారంభించాలన్నా నిధులు అవసరం అని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి చెబుతున్నారు.

also read కొత్త ఏడాదిలో బంగారం ధర ఎంతో తెలుసా....
 
వచ్చే జూన్‌నాటికి సంస్థను కొనేవారు దొరకనట్లయితే ఎయిర్‌ ఇండియా పరిస్థితి కూడా కార్యకలాపాలు నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ మాదిరిగా మారవచ్చని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించాలన్న ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి నిధులు అంతగా అందడం లేదు. 

2011-12 నుంచి ఈ ఏడాది డిసెంబర్ నెల వరకు ఎయిర్‌ ఇండియాకు ప్రభుత్వం రూ.30,520.21 కోట్ల నిదులు ఇచ్చింది. అయినా సంస్థ ఆశించిన స్థాయిలో పురోగతి సాధించడం లేదు. కాగా ఇటీవలే ఎయిర్‌ ఇండియా రూ.2,400 కోట్ల నిధుల సమీకరణ కోసం సావరిన్‌ గ్యారెంటీని ప్రభుత్వాన్ని కోరింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ మాత్రం కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఉంది. ప్రస్తుతానికి ఎయిరిండియా కార్యకలాపాలను కొనసాగించగలుగుతున్నామని, జూన్‌ వరకు మాత్రమే ఈ పరిస్థితిని కొనసాగించవచ్చని,. ఆ తర్వాత కొనుగోలుదారులెవరూ రాకుంటే మూసివేతేనని ఆ ఉన్నతాధికారి చెప్పారు.
 

also read ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...న్యూ ఇయర్ కానుకగా...


కాగా 2018-19 సంవత్సరంలో ఎయిర్‌ ఇండియా నికర నష్టాలు రూ.8,556 కోట్లు ఉన్నట్టు అంచనా. దీంతోపాటు సంస్థపై రూ.60,000 కోట్ల అప్పుల భారం ఉంది. ఇందులో సగం సొమ్మును స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్‌కు బదిలీ చేశారు. కాగా ఎయిర్‌ ఇండియాలో వంద శాతం వాటాను విక్రయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణను కోరుతూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రకటనను ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎయిర్‌ ఇండియా కొత్త కొనుగోలుదారు చేతికి వెళ్లాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు. అయితే కొనుగోలుదారును పొందడం కష్టంతో కూడుకున్న వ్యవహారంగానే భావిస్తున్నారు.
 

click me!