అమెరికా కన్నెర్ర: బ్లాక్ లిస్ట్‌లో ఆ చైనా కంపెనీలు...

By Sandra Ashok KumarFirst Published May 23, 2020, 11:05 AM IST
Highlights

అమెరికా, చైనా మధ్య మాటల యుద్దం చర్యల్లోకి వచ్చేసింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో చైనా సంస్థలకు చోటు లేకుండా అమెరికా సెనెట్ లో బిల్లు ఆమోదిస్తే.. బీజింగ్ ‘హాంకాంగ్’ అస్త్రాన్ని తీసింది. దీనికి ప్రతిగా డొనాల్డ్ ట్రంప్.. అల్ప సంఖ్యాక వర్గాలపై నిఘాకు సహకరిస్తున్నాయన్న సాకుతో 33 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్‌ లిస్టులో చేర్చింది.
 

వాషింగ్టన్‌: మైనారిటీల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మండి పడింది. అల్ప సంఖ్యాక వర్గాలపై అణచివేత ధోరణి అవలంబించేందుకు వీలుగా చైనా తరఫున గూఢచర్యం నెరుపుతున్నాయన్న ఆరోపణలతో 33 చైనా సంస్థలను ఎకనమిక్‌ బ్లాక్‌లిస్టులో చేర్చింది.

సదరు సంస్థలు చైనా మిలిటరీతో సంబంధాలు కలిగి ఉన్నాయని, మైనారిటీల ప్రయోజనాలు కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

‘ఉయిగుర్ల (షింజియాంగ్‌లోని తెగ)పై సామూహిక నిర్బంధం, శ్రమదోపిడి, అత్యాధునిక టెక్నాలజీతో వారిపై నిఘా వేసేందుకు చైనా చేపట్టిన అణచివేత కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఈ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి’’అని అమెరికా వాణిజ్య విభాగం పేర్కొంది.

అమెరికా ఎకనమిక్‌ బ్లాక్‌లిస్టులో పెట్టిన కనీసం ఏడు టెక్నాలజీ కంపెనీలు ఉండగా.. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న హాంకాంగ్‌ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేసే ముసాయిదా బిల్లుకు చైనా పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది.

ఈ క్రమంలో బిల్లు చట్టరూపం దాల్చితే హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తి కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో డ్రాగన్‌ ఈ మేరకు పావులు కదుపుతోంది. అదే విధంగా తైవాన్‌పై సైతం హాంకాంగ్‌ మాదిరి పెత్తనం చెలాయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అంతేగాకుండా సరిహద్దుల్లో పొరుగు దేశాల సైన్యాన్ని పదే పదే రెచ్చగొడుతూ దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది. 

also read రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ :అమెరికా సంస్థతో వేల కోట్ల భారీ ఒప్పందం.. ...


ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా వైరస్‌ విషయంలో చైనాపై మండిపడుతున్న అమెరికా చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక జాతీయ సైబర్‌ సెక్యూరిటీ చట్టాన్ని తెచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని సేకరించి.. తద్వారా అందరి డేటాను చౌర్యం చేసేందుక సమాయత్తమైందని ఆరోపించింది.

ఈ క్రమంలో అమెరికా వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేస్తూ.. చైనా టెలికం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇక తాజాగా హాంకాంగ్‌, ఉయిగుర్ల పట్ల చైనా దమననీతిని నిరసిస్తూ 33 కంపెనీలను బ్లాక్‌లిస్టులో చేర్చి వాటికి నిధులు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ఉపక్రమించింది.

గతేడాది సైతం ఇదే తరహాలో 28 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్‌లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో.. రక్షణ రంగానికి గతేడాది 177 బిలియన్‌ డాలర్ల బడ్జెట్ కేటాయించిన డ్రాగన్‌.. ఈసారి దానిని 6.6 శాతం పెంచుతూ 179 బిలియన్‌ డాలర్లు చేయడం గమనార్హం.

click me!