దేశవ్యాప్తంగా 60శాతం మహిళల వద్దనే బంగారు ఆభరణాలు.. తాజా సర్వే సంచలనం..

By Sandra Ashok Kumar  |  First Published May 28, 2020, 10:40 AM IST

దేశవ్యాప్తంగా 60 శాతం మంది మహిళల వద్ద బంగారు ఆభరణాలు ఉన్నాయి. భారత్ గోల్డ్‌ జువెలరీకి కీలక మార్కెట్‌గా నిలిచిందని ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదికలో తేలింది. కానీ యువతరం బంగారంపట్ల ఆసక్తి చూపడం లేదని కూడా నిర్ధారించింది.  
 


ముంబై: భారతీయులు.. మన మహిళామణులకు బంగారం అంటే ఎంతో ప్రీతి. నగలపై కాస్త మోజు ఎక్కువే. పండగ.. పెళ్లి.. ఉత్సవం ఏదైనా వారికి ఆభరణమే ప్రధాన అలంకరణ. దేశంలోని 60 శాతం మంది నారీమణులు ఇప్పటికే బంగారు ఆభరణాలు కలిగి ఉన్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నిర్వహించిన తాజా సర్వే నివేదిక వెల్లడించింది. 

మరో 37 శాతం మహిళలు మున్ముందు భవిష్యత్‌లో స్వర్ణ శోభితం కావాలని ఆరాటపడుతున్నారని డబ్ల్యూజీసీ సర్వేలో తేలింది. గోల్డ్‌ జువెలరీకి భారత్‌ కీలక మార్కెట్‌ అని ఆ నివేదిక వెల్లడించింది. ఫ్యాషన్‌ ఉత్పత్తుల కొనుగోలు విషయానికొస్తే, డిజైనర్‌ దుస్తులు కాదంటే చీరల తర్వాత స్థానం పసిడి ఆభరణాలదేనని సర్వేలో పాల్గొన్న మహిళలు తేల్చారు.  

Latest Videos

ఇప్పటి వరకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేదని 37 శాతం మంది మహిళలు చెప్పారు. వారిలో 44 శాతం మహిళలు గ్రామీణ, 30 శాతం పట్టణ ప్రాంతాల వారు ఉన్నారని డబ్ల్యూజీసీ సర్వే వెల్లడించింది. పట్టణ మహిళలు భవిష్యత్‌ భద్రత, సంపద విలువ పెంచుకునే దృష్ట్యా బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారని పేర్కొంది.

గ్రామీణ మహిళలు సమాజంలో గౌరవం పెంచుకునేందుకు బంగారు ఆభరణాలు ధరించాలనుకుంటున్నారని డబ్ల్యూజీసీ తెలిపింది. అయితే 18-24 ఏళ్ల మధ్య వయసు కలిగిన యువ మహిళలకు మాత్రం బంగారంపై మోజు తగ్గుతోందని ఈ సర్వే నిగ్గు తేల్చింది. వీరిలో 33 శాతం గత ఏడాదికాలంలో గోల్డ్‌ జువెలరీ కొనుగోలు చేసినా, భవిష్యత్‌లో కొనుగోలు చేసే అవకాశాలు తక్కువేనన్నది. ముఖ్యంగా పట్టణ యువ మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కన్పిస్తోందని డబ్ల్యూజీసీ వివరించింది.

also read అమ్మ రాణాకపూర్: డిపాజిట్లతో అడ్డగోలు రుణాలు.. ఏళ్లుగా యెస్ బ్యాంక్ స్కాం

భారత్‌లోని 1,017 మంది గ్రామీణ మహిళలతో ముఖాముఖిగా, 1,023 మంది పట్టణ మహిళలతో ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసి ఈ నివేదికను రూపొందించినట్లు డబ్ల్యూజీసీ వెల్లడించింది. బంగారం మన్నిౖకైనదే కాకుండా, చక్కని పెట్టుబడి సాధనమని, కుటుంబ వారసత్వ సంపదంటూ.. మహిళలకు ఇది చక్కని ఎంపిక అని ఈ సర్వే పేర్కొంది. 

62% మంది భారత్‌ మహిళలు డిజైనర్‌ దుస్తులు లేదా చీరలు కలిగి ఉంటే, 60 శాతం మంది బంగారు ఆభరణాలు, 57 శాతం మంది వెండి ఆభరణాలు కలిగి ఉన్నారని డబ్ల్యూజీసీ సర్వే పేర్కొన్నది. 50% మంది లగ్జరీ కాస్మెటిక్స్‌ వాడతారని, 49 శాతం మంది మహిళలు డిజైనర్‌ యాక్సెసరీస్‌ వినియోగిస్తారని తేలింది. 

44 శాతం మంది మహిళలు వియరబుల్‌ గ్యాడ్జెట్స్‌ వాడితే, స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌  వాడే వారు 41 శాతం మంది ఈ సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. 26 శాతం మంది వజ్రాభరణాలు ధరిస్తే, 32 శాతం మంది ఖరీదైన చేతి గడియారాలు వాడతారని డబ్ల్యూజీసీ నిర్ధారించింది. 

సాధారణంగా భారతీయ మహిళలు అలంకరణ, పెట్టుబడి సాధన, కుటుంబ వారసత్వం, సామాజిక ఆమోదం, షాపింగ్ అనుభవం తదితర కారణాలతో పసిడి కొనుగలు చేస్తారు. కానీ ప్రస్తుతం యువతరం బంగారాన్ని తమ పరువు, తాహతు, హోదా ఫ్యాషన్‌కు సంబంధించిన అంశం కాదని తేలింది. 

click me!