ప్రయివేట్ బ్యాంకు యెస్ బ్యాంక్‌లో దాని వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చింది. డిపాజిటర్ల సొమ్ముతో అడ్డగోలు రుణాలు మంజూరు చేసి.. కూతుళ్ల సంస్థల పేరిట యథేచ్చగా నిధుల మళ్లించారని న్యాయస్థానానికి సమర్పించిన చార్జిషీట్‌లో ఈడీ వెల్లడించింది,
న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్‌లో కొందరి ఇష్టారాజ్యం నడిచింది. ఏండ్ల తరబడి కుంభకోణం సాగింది. కొన్ని సంస్థలు అప్పటికే అప్పులు చేసినా.. వ్యాపారాలు నష్టాల్లో ఉన్నా పట్టించుకోకుండా కార్పొరేట్లకు వేల కోట్ల రుణాలిచ్చిన ఏకైక బ్యాంక్ యెస్ బ్యాంక్ అంటే అతిశయోక్తి కాదు.
ఈ వ్యవహరం వెనుక యెస్ బ్యాంకు ప్రమోటర్ రాణా కపూర్ ఉన్నట్లు తేలింది. అంతే కాదు..డిపాజిటర్ల సొమ్మును డైరెక్టర్లు పక్కదారి పట్టించారు. ఈ దారుణాలన్నీ దర్యాప్తు సంస్థల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. యెస్ బ్యాంక్‌లో చాలా ఏళ్ల నుంచే అవినీతి మొదలైంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో రవ్నీత్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం పీకల్లోతు అప్పులు ఉన్న కార్పొరేట్ సంస్థలకూ యెస్ బ్యాంక్ వేల కోట్ల రుణాలిస్తూ పోయింది. ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా పట్టించుకోకుండా కొత్త అప్పులిచ్చారని ఈడీ చార్జిషీట్ స్పష్టం చేసింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్, కాక్స్ అండ్ కింగ్స్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్), ఓంకార్ గ్రూప్, రేడియస్ డెవలపర్ తదితర భారీ కార్పొరేట్లు/రుణగ్రహీతలకు యెస్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున రుణాలు మంజూరవడం గమనార్హం.
అప్పులు పెరిగిపోవడం, ఆస్తులు తరిగిపోవడంతో యెస్ బ్యాంక్ సంక్షోభంలోకి జారుకున్న సంగతి తెలిసిందే. ఖాతాదారులు, డిపాజిటర్ల ప్రయోజనార్థం ఈ ఏడాది మార్చిలో బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.
యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్ నియంతృత్వ పోకడలను అనుసరించారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లకు చెందిన ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్, బిలీఫ్ రియల్టర్ సంస్థలకు రుణాలను పొడిగించడం ప్రమాదమని రిస్క్ టీం సూచించినా వినలేదని పలువురు బ్యాంక్ ఉన్నతోద్యోగులు చెప్పినట్లు ఈడీ తమ చార్జిషీట్‌లో పేర్కొన్నది.
also read కరోనా ఎఫెక్ట్ అంతులేనిది: అలర్ట్ కాకుంటే అంతే.. చైనా పరిశోధకురాలు హెచ్చరిక
రూ.1,700 కోట్ల రుణాన్ని మంజూరు చేయగా, అదే రోజు రూ.750 కోట్లను ఇచ్చారని ఈడీ వివరించింది. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రత్యేక ఆడిటింగ్ మొదలు కావడంతో మిగతా రూ.950 కోట్ల రుణం రద్దయ్యిందని తెలిపింది.
యెస్ బ్యాంక్ కుంభకోణం, రాణా కపూర్ అవినీతి వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్లు ఈడీ చార్జిషీట్ బహీర్గతం చేసింది. కపూర్ భార్య బిందుసహా కూతుర్లు ఈ నేరాల్లో పాలుపంచుకున్నారని వివరించింది. బ్యాంక్ నుంచి అడ్డదారిలో రుణాలు పొందినవాళ్లు వీరి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలకు ప్రయోజనం చేకూర్చారని చెప్పింది.
రాణా కపూర్ కుటుంబ సభ్యులు 100కి పైగా సంస్థల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి నిధులను మళ్లించినట్లు ఈడీ తమ చార్జిషీట్‌లో వెల్లడించింది. కపూర్, ఆయన కుటుంబం, వారి సంస్థలపై ఇటీవల నమోదు చేసిన మనీలాండరింగ్ అభియోగాలపై ప్రత్యేక కోర్టు విచారణ కూడా జరుపుతున్నది.
ఖాతాదారుల డిపాజిట్ల సొమ్ముతోనే రూ.3,700 కోట్ల విలువైన డీహెచ్‌ఎఫ్‌ఎల్ డిబెంచర్లను యెస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. దీనికి ప్రతిగా డూఇట్ అర్బన్ వెంచర్స్‌కు డీహెచ్‌ఎఫ్‌ఎల్ రూ.600 కోట్లు అందజేసింది. ఈ వెంచర్స్ డైరెక్టర్లు రాణా కపూర్ కూతుర్లే కావడం గమనార్హం.
ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్‌కు యెస్ బ్యాంక్ రూ.750 కోట్ల రుణాలు మంజూరు చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్‌దే ఈ ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్‌గా ఉన్నారు. ఇక రాణా కపూర్‌పై మోర్గాన్ క్రెడిట్ సంస్థకు రూ.2,185 కోట్లు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.
సదరు మోర్గాన్ క్రెడిట్ డైరెక్టర్లు కూడా కపూర్ కుమార్తెలేనని ఈడీ దర్యాప్తులో తేలింది. అంతే కాదు.. బ్యాంక్‌కు సంబంధించిన రూ.125 కోట్ల డివిడెండ్లు కూడా పక్కదారి పట్టాయి. నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ నుంచి తీసుకున్న రూ.1,100 కోట్ల రుణాలను దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.