Startup Mahakumbh : ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ రెండో ఎడిషన్ ప్రారంభమయ్యింది 3000+ స్టాళ్లు, ప్రముఖ నాయకులు, స్టార్టప్‌ల సందడి నెలకొంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటంటే...
Startup Mahakumbh: స్టార్టప్ మహాకుంభ్ రెండో ఎడిషన్ నిన్న(గురువారం) ప్రారంభమయ్యింది. ఏప్రిల్ 3న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా మొదలైంది. ఇందులో భారతదేశపు టెక్ ఎకోసిస్టమ్‌కు చెందిన టాప్ వ్యక్తులతో పాటు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ స్టార్టప్ మహాకుంభ్ రెండో ఎడిషన్ థీమ్ 'స్టార్టప్ ఇండియా @ 2047 - అన్‌ఫోల్డింగ్ ద భారత్ స్టోరీ'.
2024లో మొదటిసారిగా ఈ స్టార్టప్ మహాకుంభ్ నిర్వహించారు... ఇప్పుడు జరిగేది రెండో ఎడిషన్. భారతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, గ్లోబల్ స్థాయిలో వారి ఆవిష్కరణలను గుర్తించడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన చొరవే ఈ స్టార్టప్ మహాకుంభ్.
మొదటి రోజు ఈ కార్యక్రమంలో 3000 కంటే ఎక్కువ స్టాళ్లతో భారీ ప్రదర్శన ఏర్పాటుచేయగా వేలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో DPIIT, GeM, MeitY వంటి ప్రభుత్వ సంస్థల స్టాళ్లతో పాటు Paytm, Groww, Swiggy వంటి పరిశ్రమ దిగ్గజాలు కూడా ఉన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయత్నంలో తమవంతు సహకారం అందిస్తారని తెలిపారు. స్టార్టప్ నిపుణులు, ఆవిష్కర్తలు, పరిశ్రమలు కలిసి మెరుగైన, బలమైన, శక్తివంతమైన భారతదేశం కోసం సహకరించాలని కోరుకుంటున్నారు.
ప్రారంభోత్సవ సెషన్‌లో ‘రోడ్ టు స్టార్టప్ ఇండియా 2047’ థీమ్‌పై GeM’s సీఈఓ అజయ్ భాదు మాట్లాడుతూ... స్టార్టప్ అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. సిడ్బీ ఛైర్మన్, ఎండీ మనోజ్ మిట్టల్ భారతదేశంలో స్టార్టప్ ఫైనాన్సింగ్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతీయ స్టార్టప్‌లకు స్థిరమైన ఫైనాన్సింగ్ మార్గాలను సృష్టించడంలో సిడ్బీ పాత్ర గురించి మిట్టల్ మాట్లాడారు.
ప్రారంభోత్సవ సెషన్‌లో Nasscom ప్రెసిడెంట్ రాజేష్ నాంబియార్, Assocham అధ్యక్షుడు సంజయ్ నాయర్ కూడా పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం, సీఈఏ వెంకటరమణ అనంత నాగేశ్వరన్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, FICCI అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులలో ఉన్నారు.
Lenskart సీఈఓ, కో-ఫౌండర్ పీయూష్ బన్సల్, boAT కో-ఫౌండర్, సీఎంఓ అమన్ గుప్తా, upGrad కో-ఫౌండర్, చైర్‌పర్సన్ రోనీ స్క్రూవాలా, Rukam Capital ఫౌండర్, మేనేజింగ్ పార్టనర్ అర్చన జహాగీర్‌దార్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ కాన్‌క్లేవ్ మొదటి రోజు పాల్గొన్నారు.