విజయ్ మాల్యా ఆస్తుల వేలానికి... కోర్టు గ్రీన్ సిగ్నల్

By Sandra Ashok KumarFirst Published Jan 2, 2020, 10:46 AM IST
Highlights

బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఎగవేసి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబైలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులును బ్యాంకులు వినియోగించు కోవడానికి అనుమతించింది. ఈ ఆదేశాలపై అప్పీల్ సుకునేందుకు వీలుగా ఉత్తర్వుల అమలుపై ఈ నెల 18 వరకు స్టే విధించింది.
 

ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యాకు కొత్త సంవత్సరాది రోజునే ఎదురుదెబ్బ తగిలింది. కింగ్ ఫిషర్స్ అధినేత విజయ్‌ మాల్యా చరాస్తులను తాము ఇచ్చిన రుణాల వసూళ్ల కోసం అమ్మడానికి బ్యాంకులకు అనుమతి లభించింది. 

also read ‘మహారాజా’పై ఎతిహాద్ ‘కన్ను’.. టాటా సన్స్, ఇండిగో కూడా..

ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కూటమికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకోవడానికి ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక కోర్టు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వెల్లడించారు.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత, మాజీ లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యా దేశీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్లకుపైగా బకాయి పడిన విషయం తెలిసిందే. వీటిని చెల్లించకుండా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా మాల్యాపై ముద్ర పడింది.

బాకీల వసూళ్లలో భాగంగా మాల్యా చరాస్తులను ఉపయోగించుకుంటామని బ్యాంకర్లు ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. రూ.6 వేల కోట్లకుపైగా ఆస్తులను అమ్మేస్తామని బ్యాంకులు కోర్టుకు పెట్టుకున్న దరఖాస్తులో పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకులకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

also read ఎకానమీ అస్తవ్యస్థం.. అందుకే రూ.102 లక్షల కోట్లతో ‘నిర్మల’మ్మ మెగా ఇన్‌ఫ్రా పుష్

యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (యూబీహెచ్‌ఎల్‌) షేర్లు తదితర ఆర్థిక సెక్యూరిటీలతో కూడిన ఆస్తులను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టు 2016లో జప్తు చేసింది. మాల్యాను అపరాధిగా ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ఈ చర్యకు దిగింది.

బ్యాంకుల తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ పాటిల్‌.. మాల్యా చరాస్తులపై జప్తును ఎత్తివేయాలని మంగళవారం ప్రత్యేక కోర్టును కోరారు. ఈ క్రమంలోనే కోర్టు అందుకు సమ్మతించింది. అయితే దీనిపై బాంబే హై కోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు అవకాశమిచ్చిన కోర్టు.. తమ తాజా ఆదేశాన్ని ఈ నెల 18 వరకు నిలుపుదల చేసింది. మాల్యా తరఫున సీనియర్‌ న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ కోర్టు ఆదేశాలు అందిన తర్వాత తాము స్పందిస్తామని ఆయన తెలిపారు.

click me!