నిస్తేజంలో చిక్కుకున్న దేశీయ ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేందుకు నరేంద్రమోదీ సర్కార్ భారీ ప్రణాళిక ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్లతో మెగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పుష్ ముందుకు తీసుకొచ్చింది.
అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో గతే ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్ కోల్పోయింది. సెప్టెంబర్ నెలలో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది.
2024 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోతలు విధించాయి.
undefined
ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం పూనుకున్నది. అందులో భాగంగా పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును పాతిక శాతానికి తగ్గించడం, ఆర్థిక రంగ పునర్‌వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల కోత వంటివి వీటిలో కీలకమైనవి. తాజాగా కొత్త సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం పలికింది మోదీ సర్కారు.
Also:మదుపర్లకు పెరిగిన రూ.11 లక్షల కోట్ల సంపద
దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నిస్తేజాన్ని తరిమికొట్టేందుకు భారీ ప్యాకేజీనే ఆవిష్కరించింది. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.356 లక్షల కోట్లు)కు చేర్చాలన్న లక్ష్య సాధన కోసం ఏకంగా రూ.102 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.
రాబోయే ఐదేళ్లకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వీటిని ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులను పెడుతున్నామని తెలిపారు.
Also Read:కొత్త ఏడాదిలో బంగారం ధర ఎంతో తెలుసా....
ప్రధాని హామీకి అనుగుణంగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అటాన్ చక్రవర్తి నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ రూ.102 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను గుర్తించిందన్నారు. కేవలం నాలుగు నెలల్లో వివిధ రంగాల్లోని 70 మంది భాగస్వాములతో సంప్రదింపులు జరిపామని చెప్పారు.
మరికొద్ది వారాల్లో మరో రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టులనూ ప్రకటిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందులో జేవర్ ఎయిర్‌పోర్టు, జల్ జీవన్ మిషన్ ఉండనున్నాయి. కాగా, ఈ రూ.102 లక్షల కోట్ల జాతీయ మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్రం 39 శాతం, రాష్ర్టాలు 39 శాతం, ప్రైవేట్ రంగ సంస్థలు 22 శాతం చొప్పున భాగస్వాములుగా ఉంటాయని మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
గత ఆరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.51 లక్షల కోట్ల పెట్టుబడులను మౌలిక రంగ ప్రాజెక్టులపై పెట్టాయని ఆమె చెప్పారు. ఈసారి ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.105 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
2025కల్లా ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యం 30 శాతానికి చేరవచ్చన్నారు. తద్వారా 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ కల కూడా నెరవేరగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ప్రతిపాదించిన ప్రాజెక్టుల అమలుతో ఉద్యోగ, ఉపాధి కల్పన, జీవన ప్రమాణాలు మెరుగుపడవచ్చునని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ సంస్థల సమన్వయంతో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ)ను ఏర్పాటు చేయాలని కూడా మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ మొత్తం ప్రాజెక్టులను ఎన్‌ఐపీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాజెక్టుల నిధుల కోసం రుణ మార్కెట్లు, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు వైపు ప్రభుత్వం చూస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భారీ మౌలిక పెట్టుబడుల్లో పలు రంగాల ప్రాజెక్టులు ఉన్నాయి. విద్యుత్, రైల్వేలు, రహదారులు, పట్టణాభివృద్ధి, పునరుత్పాదక శక్తి, నీటి పారుదల, విద్య, ఆరోగ్యం, డిజిటల్, మొబిలిటీ, పట్టణాల్లో త్రాగునీటి అవసరాలు, జల సంరక్షణ, వ్యవసాయం, ఆహార శుద్ధి, ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలున్నాయి.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా ఇందులో ఉన్నది. ఈ ప్రాజెక్టులు 22 మంత్రిత్వ శాఖల పరిధిలో, 18 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వ్యాప్తంగా ఉన్నాయి. ఎనర్జీ, విద్యుదుత్పత్తికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది.
మొత్తం రూ.102 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టుల్లో దాదాపు రూ.25 లక్షల కోట్లు ఈ రంగాలకే కేటాయించింది. మొత్తం రూ.24.54 లక్షల కోట్లలో 11.7 లక్షల కోట్లు విద్యుదుత్పత్తికి కేటాయించారు. మిగతా సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఎనర్జీ రంగ ప్రాజెక్టులపై పెట్టనున్నారు.
130 కోట్ల దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా, ఇంటింటికి విద్యుత్ వెలుగుల లక్ష్య సాధనకు తగ్గట్లుగా ఎనర్జీ ప్రాజెక్టులకు మోదీ సర్కార్ అగ్ర తాంబూలం ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తే ఎక్కువగా జరుగుతుండటంతో సౌర, పవన విద్యుదుత్పత్తికి ప్రాధాన్యతనిచ్చేలా కేంద్రం చర్యలు చేపడుతున్నది.
Also Read:వచ్చే జూన్ నాటికి ఎయిర్ ఇండియా మూసివేత...
థర్మల్ పవర్.. వాతావరణ కాలుష్యానికి దారితీస్తుండటం, జల వనరులు త్రాగు, సాగు అవసరాలకే చాలకుండటంతో ప్రకృతి వనరులపై దృష్టి సారించింది. 2024-25 వరకు ఏయే సంవత్సరానికి ఎంత విలువైన ప్రాజెక్టులను చేపడుతామో ఆ వివరాలను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అటాను చక్రవర్తి వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2019-20)కి రూ.13.6 లక్షల కోట్ల ప్రాజెక్టులను అమలు చేస్తామన్న ఆయన వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.19.5 లక్షల కోట్ల ప్రాజెక్టులు లైన్‌లోకి వస్తాయని తెలిపారు.
2021-22లో రూ.19 లక్షల కోట్లు, 2022-23లో రూ.13.8 లక్షల కోట్లు, 2023-24లో రూ.12.8 లక్షల కోట్లు, 2024-25లో రూ.11.1 లక్షల కోట్ల ప్రాజెక్టుల అమలు ప్రణాళిక రూపొందించామని అటాను చక్రవర్తి వివరించారు.
ఇక ఈ రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో రూ.42.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో, రూ.32.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు సంభావిత దశలో, రూ.19.1 లక్షల కోట్ల ప్రాజెక్టులు అభివృద్ధి క్రమానుగత దశలో ఉన్నాయన్నారు.