
ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ కీలక రేట్లను యథాతథంగా ఉంచడంతో బెంచ్‌మార్క్ సూచీలు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు నష్టాలను చవిచూసిన నిఫ్టీ, సెన్సెక్స్ శుక్రవారం లాభాల్లో ముగిశాయి.
మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 412.23 పాయింట్లు లాభపడి 59,447.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 144.80 పాయింట్లు లాభపడి 17,784.30 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 2232 షేర్లు పురోగమించగా, 1072 షేర్లు క్షీణించాయి.117 షేర్లు మారలేదు.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్‌ఎంలు నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అలాగే సిప్లా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా సైతం టాప్ గెయినర్లుగా నిలిచాయి.
సెక్టార్ పరంగా చూస్తే ఎఫ్‌ఎంసిజి, మెటల్, పవర్, ఆయిల్ & గ్యాస్ సూచీలు 1-2 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి.
ఆర్‌బిఐ ఎంపీసీ సమావేశం నేపథ్యంలో గత 2-3 రోజులలో మార్కెట్ లో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేశారు. అయితే మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండే చర్యలు రిలీఫ్ ర్యాలీకి దారితీశాయి.
IT, బ్యాంకింగ్ రంగంలో వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే Q4 ఆదాయాల సీజన్‌పై దృష్టి సారించింది. Q4 బలహీనంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో IT మార్కెట్లపై దృష్టి నెలకొని ఉంది. అయితే బ్యాంకింగ్ రంగంలో మాత్రం క్రెడిట్ వృద్ధి మరియు బ్యాలెన్స్ షీట్‌లో మెరుగుదల వేగవంతమైన బౌన్స్ కారణంగా బ్యాంకింగ్ రంగం కోసం ఔట్‌లుక్ బలంగా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా
ఆర్‌బీఐ 2023 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 4.7 శాతం నుంచి 5.7 శాతానికి పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ తొలి సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం పేర్కొన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తున్నట్లు దాస్ తెలిపారు.