Latest Videos

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఇప్పటి నుంచి ఉచితంగానే..

By Ashok KumarFirst Published Jul 2, 2024, 6:50 PM IST
Highlights

ఆయుష్మాన్ భారత్ పథకం కింద 55 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ లబ్ది చేకూరనుంది. 

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంతో దేశంలోని వృద్ధులందరికీ లబ్దిచేకూరనుంది. అదేమిటంటే.. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. దేశంలో 25,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అలాగే, ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత చికిత్స అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. 

ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం కింద 55 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. దీనితో పాటు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత చికిత్స ప్రయోజనాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వం - స్పాన్సర్ చేస్తున్న ఆరోగ్య బీమా పథకం. ఇందులో దేశంలోని 12 కోట్ల తక్కువ ఆదాయం ఉన్న అంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చికిత్స కోసం సంవత్సరానికి రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా అందజేస్తోంది.

ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు, ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం హెల్త్ కార్డు వివరాలతో కూడిన గుర్తింపు కార్డు, రిసిప్ట్  జారీ చేస్తుంది. ఈ హెల్త్ కార్డు ఉపయోగించి దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలోని ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో  ఉచిత చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్‌లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, రెసిడెన్సీ ప్రూఫ్, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రం (ఇన్ కం సర్టిఫికెట్), పాస్ పోర్ట్ సైజు ఫోటో, కేటగిరీ సర్టిఫికేట్ వివరాలు అందించాల్సి ఉంటుంది.

ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం ఎలా అప్లయ్ చేయాలి? 

1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి pmjay.gov.in సైట్‌ను ఓపెన్ చేయండి.

2. వెబ్‌సైట్‌లో, ABHA-రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. 

3. ఆధార్‌ వెరిఫై చేయడానికి OTPని ఎంటర్  చేయండి.

4. పేరు, ఆదాయం, పాన్ కార్డ్‌తో సహా ఇతర సమాచారాన్ని ఎంటర్  చేయండి.

5. ఇప్పుడు అప్లికేషన్ ఆమోదించే వరకు వేచి ఉండాలి, తరువాత ఆయుష్మాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

6.  ఆసుపత్రుల్లో క్యాష్  లెస్  చికిత్స పొందేందుకు కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

 

click me!