భారతీయ టెలికం నెట్‌వర్క్ దిగ్గజం కస్టమర్లకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచేసిన జియో... మరో రెండు ప్లాన్లను మార్చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టారిఫ్‌లు పెంచేసిన టెలికం నెట్‌వర్క్ దిగ్గజం జియో వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. కస్టమర్లు వినియోగించే రెండు పాపులర్ ప్లాన్లను తొలగించినట్లు తెలుస్తోంది. యూజర్లు ఎక్కువగా వినియోగించే రూ.395, రూ.1,559 ప్లాన్లను తొలిగించినట్లు సమాచారం.
కొత్త టారిఫ్‌లు జులై 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక విడత అదనపు ఛార్జీల బారినుంచి తప్పించుకునేందుకు ఒకరోజు ముందుగానే రీఛార్జ్ చేసుకోవడానికి వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, రూ.395, రూ.1,559 ప్లాన్లు కనిపించడం లేదు. దీనిపై వినయోగదారులు కొందరు ‘ఎక్స్’లో ఫిర్యాదులు చేస్తున్నారు.
కాగా, రూ.1,559 ప్యాక్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 24జీబీ డేటా పరిమితితో అపరిమిత కాల్స్ చేసుకొనే అవకాశం ఉంటుంది.
ఇక, రూ.395 ప్యాక్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉండేది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 6జీబీ డేటా పొందుతారు. అలాగే, అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇప్పటికే భారం...
ఈ రెండు ప్లాన్ల తొలగింపునకు ముందే టారిఫ్‌లలో పలు మార్పులను చేసింది జియో. ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ పెంపు ప్రభావం దేశంలోని లక్షల మంది జియో కస్టమర్లపై పడనుండగా... పెరిగిన ధరలు రేపటి (జూలై 3) నుంచే అమలులోకి రానున్నాయి.
మార్చిన టారిఫ్‌ల ప్రకారం.. 28 రోజుల 2GB డేటా ప్లాన్ ధర ప్రస్తుతం రూ.189. గతంలో రూ.155 ఉండేది. అలాగే 1GB ప్లాన్ ధర రూ.209 నుండి రూ.249కి, 1.5 జీబీ డైలీ డేటా ప్లాన్ ధర రూ.239 నుంచి రూ.299కి, 2GB డైలీ ప్లాన్ ఇప్పుడు రూ.299 నుండి రూ.349కి పెంచుతున్నట్లు జియో ప్రకటించింది.
ఎక్కువ డేటా అవసరాలు ఉన్న యూజర్లు ఎంచుకునే 2.5GB డైలీ ప్లాన్ ధర రూ.349 నుంచి రూ. 399కి, 3GB డైలీ డేటా ప్లాన్ ధర రూ.399 నుంచి రూ. 449కి పెంచేసింది జియో.
ఇక రెండు నెలల ప్లాన్లకు కూడా జియో వదల్లేదు. రెండు నెలలకు 1.5GB డైలీ డేటా ప్లాన్ రూ. 479 ఉండగా.. ఇకపై రూ.579 చెల్లించాల్సి ఉంటుంది. రూ.533 ఉండే డైలీ 2జీబీ ప్లాన్ కోసం ఇకపై రూ.629 చెల్లించాలి. అలాగే, రూ.395కే వచ్చే మూడు నెలల 6GB డేటా ప్లాన్ కోసం ఇకపై రూ.479 ఖర్చు చేయాల్సి వస్తుంది.