బీరెడీ: బ్యాంకింగ్‌లో లక్ష కొలువులు.. భారీ ప్యాకేజీల ఆఫర్లు!!

By sivanagaprasad KodatiFirst Published Dec 18, 2018, 10:05 AM IST
Highlights

ప్రైవేట్, బహుళజాతి సంస్థలతో పోటీ పడి సేవలందించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లక్ష మందిని నియమించుకోవడంతోపాటు భారీ ప్యాకేజీలతో కూడిన వేతనాలు ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 

యువతరానికి, ఉద్యోగార్థులకు శుభవార్త. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పుష్కలమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ కలగలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్షరాలా లక్ష మంది నూతన ఉద్యోగులను నియమించుకోనున్నాయి. 

ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కార్యకలాపాల వేగవంతం, నూతన తరం బ్యాంకింగ్ పద్ధతుల దిశగా అడుగులేసేందుకు యువతరం సేవలు అవసరం అని బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసిస్తోంది. ఈ క్రమంలోనే నూతన ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 

మొండి బకాయిలతో సతమతం అవుతున్న బ్యాంకులు మరింత పోటీతత్వాన్ని అలవర్చుకునే దిశగా అడుగులేస్తున్నాయని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నియామకంపై రిక్రూట్ మెంట్ సంస్థ టీం లీజ్ బిజినెస్ హెడ్ సవ్యసాచి చక్రవర్తి తెలిపారు. 

ఈ క్రమంలో జరిగే బ్యాంకింగ్ నియామకాలన్నీ పైన పేర్కొన్న బ్యాంకుల కన్సార్టియం ఉమ్మడిగా చేపట్టనున్నదని తెలుస్తోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం గత రెండేళ్లలోనే క్లర్కులు, మేనేజ్మెంట్ ట్రైనీలు, ప్రొబేషనరీ అధికారులుగా రమారమీ 95 వేల మందిని నియమించుకున్నాయి. 

తాజా నియామకాల్లో ప్రధానంగా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఎనలిటిక్స్‌, స్ట్రాటజీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌,  కస్టమర్స్‌ సర్వీసెస్‌  విభాగాల్లో  అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని సమాచారం. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే లక్ష మంది నియామకం అంటే గతంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో చేపట్టనున్నాయి. 

ఆర్థిక సేవల నిర్వహణా తీరును, వర్క్ కల్చర్‌ను మార్చుకుంటున్నాయనీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, మొండి బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 

టెక్నాలజీ, ఆన్ లైన్ సేవలపై పట్టు సంపాదించుకున్న వారికి అవకాశాలు పుష్కలం కానున్నాయి. అంతేకాదు ప్రైవేట్/ బహుళజాతి బ్యాంక్‌లకు ధీటుగా వీరికి వేతనాలను ఆఫర్‌ చేయనున్నాయని సిండికేట్ బ్యాంక్ సీఈవో  మృత్యుంజయ్‌ మహాపాత్ర వ్యాఖ్యానించడం గమనార్హం. 

click me!