ఏటీఎం లావాదేవీలపై ఎస్బీఐ కొరడా.. బట్ ఉద్యోగులకు రిలీఫ్

By sivanagaprasad KodatiFirst Published Dec 18, 2018, 9:41 AM IST
Highlights

ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేయడంతో ఎస్బీఐ తన వినియోగదారుల ఏటీఎం లావాదేవీలపై పరిమితులు విధించింది. మెట్రో నగరాల్లో ఐదు సార్లకు మించి ఏటీఎం కార్డు వాడితే అదనపు రుసుము చెల్లించాల్సిందే. ఇతర బ్యాంకుల్లో మూడు సార్లకు మించి ఏటీఎం ద్వారా నగదు డ్రా చేయొద్దు.. కాకుంటే వేతన జీవులతోపాటు మరి కొందరికి వెసులుబాటు కల్పించింది. 

ఏటీఎంలతో నగదు లావాదేవీలు నిర్వహించే ఖాతాదారులకు కష్టాలు ఎదురు కానున్నాయి. ఈ మేరకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ఆంక్షలు విధించింది. అక్టోబర్‌ 31 నుంచి నగదు లావాదేవీల మొత్తంపై పరిమితులు విధించిన ఎస్బీఐ.. తాజాగా ఏటీఎంల నుంచి నిర్దేశిత సంఖ్యకు మించి నగదు తీస్తే అదనంగా వడ్డింపులు ఉంటాయని స్పష్టంచేసింది.

అయితే వేతన ఖాతాదారులకు మాత్రం అపరిమిత సంఖ్యలో ఏటీఎంల ద్వారా లావాదేవీలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.దేశ బ్యాంకింగ్‌ రంగంలో అతి పెద్దదైన ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే నగదు మొత్తాలపై ఇప్పటికే పరిమితి విధించింది.

త్వరలో ఏటీఎంల ద్వారా నిర్వహించే లావాదేవీల సంఖ్యపై కూడా ఆంక్షలు అమలుల్లోకి తీసుకురానున్నది. ఈ ఏడాది అక్టోబర్‌ 31న కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం ఐటీఎస్‌ క్లాసిక్‌, ఏటీఎం మిస్టో డెబిట్‌ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మొత్తం రోజుకు రూ.20వేలకు కుదించింది.

ఇక కొత్తగా ఏటీఎంల ద్వారా నిర్వహించే లావాదేవీల సంఖ్యపై కూడా ఆంక్షలు విధించింది. అవి త్వరలో అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ఎస్బీఐ కస్టమర్లు మెట్రో నగరాల్లో నెలలో ఎస్‌బీఐ గ్రూపు బ్యాంకుల ఏటీఎంల నుంచి ఐదు సార్లు, మూడు సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు లావాదేవీలు కొనసాగించవచ్చని స్పష్టంచేసింది.

ఇతర ప్రాంతాల్లో ఐదు సార్లు ఎస్బీఐ ఏటీఎంల నుంచి, ఐదు సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సగటున రూ.25 వేల తమ పొదుపు ఖాతాల్లో ఉండేలా చూసుకునే ఖాతాదారులకు ఎలాంటి రుసుములు లేకుండా ఎస్బీఐ గ్రూపు బ్యాంకులలో ఏటీఎంలలో అపరిమిత సంఖ్యలో లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఎస్బీఐ కల్పించింది.

అదేవిధంగా సగటున రూ.లక్షను తమ పొదుపు ఖాతాల్లో ఉంచేవారికి ఎలాంటి రుసుము లేకుండా అన్ని రకాల బ్యాంకుల్లో అపరిమిత సంఖ్యలో ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది. పరిమితికి లోబడి ఏటీఎంల లావాదేవీలు నిర్వహించాల్సిన ఖాతాదారులు అదనంగా నిర్వహించినట్లయితే ఒక్కో లావాదేవీపై రూ.5 నుంచి రూ.20 వరకు ఛార్జీలు వేస్తారు. ఈ మొత్తానికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్థిక లావాదేవీలు కాకుండా ఇతర లావాదేవీలు ఏవైనా ఉచిత లావాదేవీల పరిమితికి మించితే రూ.5, ఆ మొత్తానికి అదనంగా జీఎస్టీ ఉంటుంది. వేతన ఖాతాలు కలిగిన ఖాతాదారులు తమ గ్రూపు బ్యాంకుల ఏటీఎంలో, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత ఏటీఎం లావాదేవీల నిర్వహణకు వెసులుబాటు కల్పించినట్లు ఎస్బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


 

click me!