జెట్ ఎయిర్వేస్‌లో గోయల్ పాత్రకిక సెలవేనా?

By rajesh yFirst Published Dec 17, 2018, 4:31 PM IST
Highlights


జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రమోటర్ నరేశ్ గోయల్ నిష్క్రమణ దాదాపు ఖాయమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2013లో 24 శాతం వాటాను ఎతిహాద్ సంస్థకు కేటాయించిన నరేశ్ గోయల్ మరోసారి సంక్షోభ నివారణకు అదే వాటా విక్రయానికి సిద్ధమయ్యారు. దీనిపై టాటా సన్స్ స్పందిస్తూ నరేశ్ గోయల్ పాత్ర తగ్గించుకోవాలని చేసిన సూచన ఆయనకు నచ్చలేదని తెలుస్తోంది. దీంతో ఎతిహాద్ సంస్థకే మరో 24 శాతం వాటా విక్రయానికి సిద్ధ పడినా.. ఇంకా ఆ సంస్థ నుంచి ఎటువంటి ప్రతిపాదన కూడా బయటకు రాలేదు. 

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’లో సంస్థ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ మనుగడ ప్రశ్నార్థకమేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిస్థాయి విమాన సర్వీసుల నిర్వహణ సంస్థగా దాని సంక్షోభ నివారణలో యాజమాన్య హక్కుల నియంత్రణ ఎవరిదన్న విషయమే ప్రధాన అవరోధంగా కనిపిస్తున్నది. విజనరీ గల పారిశ్రామిక వేత్త అయినా నరేశ్ గోయల్ శక్తి సామర్థ్యాల్లో నిజానిజాలు బయటపడే సమయం వచ్చిందని ఒక ఫైనాన్సియర్ వ్యాఖ్యానించారు. 

లో కాస్ట్ క్యారియర్‌గా ఇండిగో ప్రస్తుతం సున్నితమైన ధరలు, అధిక ఇంధన వ్యయం, ఇంధన పన్ను, రూపాయి మారకం విలువ పతనం మధ్య ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటే జెట్ ఎయిర్వేస్ 400 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నది. సిబ్బంది వేతనాలు సకాలంలో చెల్లించలేక పోతున్నది.  విమానాల రిపేర్ల సొమ్ము చెల్లించడంలోనూ ఆలస్యం అవుతున్నది సమాచారం. 

ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ యాజమాన్యానికి ఎతిహాద్ 600 మిలియన్ల డాలర్ల (24 శాతం వాటా) ఆర్థిక సాయం చేసింది. అదనంగా ఎతిహాద్‌కు మూడు లండన్ హీథ్రూ విమానాశ్రయ స్లాట్లు కేటాయించింది జెట్ ఎయిర్వేస్. మళ్లీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో బయటపడేందుకు ఎతిహాద్ సంస్థతోపాటు టాటా సన్స్ తోనూ నరేశ్ గోయల్ చర్చలు జరిపారు. కానీ గోయల్ పాత్ర తగ్గించుకోవాలన్న టాటా సన్స్ సూచన ఆయనకు నచ్చలేదు. దీంతో ఎతిహాద్ సంస్థతో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎతిహాద్ ప్రతిపాదనేమిటన్న సంగతి ఇంకా బయటకు రాలేదు కానీ నియంత్రణ బాధ్యత గోయల్ తగ్గించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అంత తేలిక కాదు. 

51 శాతం వాటాతో చైర్మన్ గా ఉన్న నరేశ్ గోయల్.. ఆయన భార్య అనిత బోర్డు సభ్యులే. ఇక అన్ని వేళల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకునేది నరేశ్ గోయల్ కావడం గమనార్హం. అప్పుడప్పుడు మినహా సీఈఓలు కీలక నిర్ణయాలు తీసుకోవడం తప్ప పూర్తిగా నిర్ణయాక శక్తి నరేశ్ గోయల్ దే. పదేళ్లలో జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఏడుగురు సీఈఓలు మారారు. ఇదిలా ఉండగా గతేడాది ఆగస్టు నుంచి వినయ్ దూబే ప్రస్తుతం సంస్థ సీఈఓగా ఉన్నారు. 

కంపెనీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రధాన ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌ ఏరికోరి ప్రధాన సలహాదారుగా తీసుకొచ్చిన మాజీ సీఈఓ నికోస్‌ కర్డాసిస్‌ ఆ పదవి నుంచి తప్పుకున్నట్టు సమాచారం. గత నవంబర్ నెలలో సెలవుపై వెళ్లిన ఆయన ఇప్పటి వరకు తిరిగి విధులకు హాజరు కాలేదు. దీనిపై జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారవర్గాలు నోరు మెదపడం లేదు.
 
2013లో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈక్విటీలో 24 శాతం వాటాను తనకు తెలియకుండా ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌కు అమ్మడాన్ని నిరసిస్తూ కూడా కర్డాసిస్‌ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు మళ్లీ కంపెనీ ఈక్విటీలో ఎథిహాద్‌కు మరింత వాటా ఇచ్చేందుకు నరేశ్‌ గోయల్‌ చర్చలు జరుపుతున్నారు. ఈ విషయం నచ్చకే కర్డాసిస్‌ సలహాదారు పదవి నుంచి తప్పుకున్నట్టు భావిస్తున్నారు.

click me!