ఐటీ రిటర్న్‌లను సమర్పించేందుకు గాను దగ్గరి బంధువులు, మిత్రుల నుంచి బూటకపు అద్దె రసీదులు, గృహ రుణాలపై అదనపు క్లెయిమ్‌లు పొందుతున్న వారి ఆటలు ఇకపై సాగవు. వీరిపై ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది.
చాలామంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ స్కానర్‌లో వున్న సంగతి తెలిసిందే. కానీ వీరంతా ఐటీ రిటర్న్‌లను సమర్పించేందుకు గాను దగ్గరి బంధువులు, మిత్రుల నుంచి బూటకపు అద్దె రసీదులు, గృహ రుణాలపై అదనపు క్లెయిమ్‌లు, నకిలీ విరాళాలు వంటి అనైతిక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారిపై ఐటీ శాఖ గట్టి నిఘా పెట్టింది. గతంలో పన్ను అధికారులను తప్పించుకోవడం ఇలాంటి మార్గాలను తప్పించుకోవడం చాలా సులభం. అయితే ఇప్పుడు మాత్రం ఇలాంటి వారికి కష్టకాలం వచ్చినట్లే. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ద్వారా వారి ఆదాయ మార్గాలపై నిఘా పెట్టినట్లు గతంలోనే జాతీయ దినపత్రిక ఎననామిక్ టైమ్స్ ఈ ఏడాది జూలై 22న నివేదించింది.
పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించాలని ఆదాయపు పన్ను శాఖ .. చెల్లింపుదారులకు నోటీసులు పంపింది. అద్దె భత్యం కింద పన్ను మినహాయింపులు పొందే వేతన జీవులకు సెక్షన్ 10 (13ఏ) కింద నోటీసులు అందిస్తారు. అలాగే అధికారిక విధులను నిర్వర్తంచడానికి సహాయకుడిని నియమించుకోవడానికి సెక్షన్ 10(14) కింద భత్యం, గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 24(బీ) కింద సాక్ష్యాలను అడిగే అధికారం ఆదాయపు పన్ను శాఖకు వుంది.
జీతభత్యాల కింద ఏడాదికి రూ.50 లక్షలకు పైగా సంపాదిస్తున్న వ్యక్తుల పదేళ్లకు సంబంధించిన ఐటీఆర్‌లను, రూ.50 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తుల ఎనిమిదేళ్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ పున: పరిశీలన చేయవచ్చు. దీనికి తోడు రికార్డుల కంప్యూటరీకరణ అనే మాధ్యమం ద్వారా రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద ట్రస్ట్‌లకు విరాళాలు ఇచ్చామని ఐటీఆర్‌లలో పేర్కొన్న వ్యక్తుల వివరాలను సరిపోల్చడానికి ఐటీ శాఖకు ఉపయోగపడుతుంది.
ఫైలర్ నుంచి ధృవీకరణలు సహా ఇతర మార్గాల నుంచి సేకరించిన సమాచారం, ఐటీఆర్ డేటా ఆధారంగా పన్ను అధికారులు క్లెయిమ్‌ల ప్రామాణికతను పరిశీలిస్తారని అసైర్ కన్సల్టింగ్ మేనేజింగ్ పార్ట్‌నర్ రాహుల్ గార్గ్ అన్నారు. ఐటీఆర్‌లను తయారు చేసి దాఖలు చేసిన చార్టర్డ్ అకౌంటెంట్, అడ్వకేట్, ఐటీ ప్రొఫెషనల్ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్‌లను సైతం బహిర్గతం చేయాలని పన్ను చెల్లింపుదారులను ఐటీ శాఖ ఇప్పటికే కోరింది.
దేశంలో పన్ను ఎగవేతదారులను కనిపెట్టడానికి ఈ స్థాయిలో సాంకేతికతను వినియోగించడం కూడా ఇదే తొలిసారి. చిన్న పన్ను పరిధిలో వున్న చాలా మంది తమ కేసులను ఎవరు పట్టించుకుంటారని అనుకుంటారు. పన్ను చెల్లింపులు చేయకపోగా.. మినహాయింపులు మాత్రం క్లెయిమ్ చేస్తూ వుంటారని సిద్ధార్ధ్ బన్వత్ అనే ఆర్ధిక నిపుణుడు పేర్కొన్నాడు.