మరింత బలహీనపడిన రూపాయి...అంతా కరోనా వైరస్ వల్లే

By Sandra Ashok KumarFirst Published Mar 20, 2020, 2:15 PM IST
Highlights

కరోనా వైరస్.. ఆర్థిక మాంద్యం ప్రభావంతో నిలకడగా నిలబడనంటోంది రూపాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 86 పైసలు పడిపోయి డాలర్‌పై రూ.75.12కు చేరింది. ఇది దేశీయ కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 

ముంబై: రూపాయి మరింత బక్కచిక్కింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఒకేరోజు 86 పైసలు/ 1.16 శాతం పతనమై చారిత్రక కనిష్ఠ స్థాయి రూ.75.12కి జారుకున్నది. గత ఆరు నెలల్లో ఒకే రోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. 

ఫారెక్స్‌ మార్కెట్‌ నుంచి మదుపరులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో మారకం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకోవచ్చునన్న అంచనాలు, ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతోపాటు ముడి చమురు తిరిగి కోలుకోవడంతో కరెన్సీల పతనాన్ని శాసించాయని విశ్లేషకులు పేర్కొన్నారు. 

also read ఎన్నికల ఎత్తుగడ?: లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇదీ ట్రంప్ వ్యూహం

ప్రస్తుత నెలలో దేశీయ ఈక్విటీ, డెబిట్‌ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.లక్ష కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకోవడంతో కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురైంది. కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో అటు ఈక్విటీలు, మరోవైపు కరెన్సీలు నేలచూపులు చూస్తున్నాయి. 

గురువారం ఉదయం 74.96 వద్ద ప్రారంభమైన డాలర్‌-రుపీ ఎక్సేంజ్‌ రేటు ఒక దశలో చారిత్రక కనిష్ఠ స్థాయి 75.30ని తాకింది. చివరకు బుధవారం ముగింపుతో పోలిస్తే 86 పైసలు క్షీణించి 75.12 వద్ద ముగిసింది. ఇది కూడా ఆల్‌టైం కనిష్ఠ స్థాయి. 

2019 సెప్టెంబర్‌ 3వ తేదీ తర్వాత ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. ఎఫ్‌పీఐలు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం, గ్లోబల్‌ మార్కెట్లు రోజు రోజుకు కరిగిపోతుండటం రూపాయి పతనానికి ఆజ్యం పోశాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ హెడ్‌ వీకే శర్మ తెలిపారు. 

also read రూపీ @75:ఐటీసీ తప్ప షేర్లన్నీ రెడ్.. 8200 దిగువన నిఫ్టీ

ప్రస్తుత నెలలో దేశీయ ఈక్విటీ, డెబిట్‌ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల నిధులను ఉపసంహరించుకున్నారు. 2013 తర్వాత ఒక నెలలో ఇంతగానం వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. రిజర్వు బ్యాంక్‌ రంగ ప్రవేశం చేయడంతో చివరకు భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. 

ఈ నెల 23న 2 బిలియన్‌ డాలర్ల నిధులను ఫారెక్స్‌ మార్కెట్లోకి చొప్పించనున్నట్లు ఆర్బీఐ ప్రకటన ఈ పతనానికి స్వల్ప బ్రేకులు వేసింది. మిగతా ఆరు కరెన్సీలు ఒక్క శాతానికి పైగా బలోపేతం అయ్యాయి. 18 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఇంధన ధరలు గురువారం 4.50 శాతం బలపడి 26 డాలర్లకు చేరుకున్నది. 
 

click me!