యెస్ బ్యాంకుకు ఆర్బీఐ అండ: మరో రూ.60 వేల కోట్ల లోన్!

By Sandra Ashok KumarFirst Published Mar 20, 2020, 10:26 AM IST
Highlights

ప్రైవేట్ బ్యాంకు యెస్ బ్యాంకుకు అండగా నిలిచేందుకు ఆర్బీఐ మరో ముందడుగు వేసింది. డిపాజిటర్ల కోసం రూ.60 వేల కోట్ల రుణ పరపతి అందించనున్నట్లు ప్రకటించింది. మారటోరియం ఎత్తివేయడంతో గురువారం నుంచి యెస్ బ్యాంకులో సాధారణ కార్యకలాపాలు ప్రారంభించినా పెద్దగా ఖాతాదారులు హాజరు కాలేదు. 

న్యూఢిల్లీ: మారటోరియం పరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ముందుకొచ్చింది. బ్యాంకుకు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటు ఇచ్చేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంది. 

యెస్ బ్యాంకుకు సుమారు రూ. 60,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. యెస్ బ్యాంకుకు అవసరమైన ద్రవ్య లభ్యత మద్దతునిస్తామని సోమవారమే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.

also read ఎస్బీఐ రీసెర్చ్: ఉద్దీపనలకు వేళయింది

గురువారం నుంచి బ్యాంకు సాధారణ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆర్బీఐ చట్టం 17 (4) సెక్షన్ కింద అదనపు ద్రవ్య లభ్యత నిధులు అందజేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్‌ బ్యాంక్‌కు ఇది తోడ్పడుతుంది. 

అయితే, దీనిపై యస్‌ బ్యాంక్‌ సాధారణంగా కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు 2004లో గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆర్‌బీఐ ఇదే తరహా రుణ సదుపాయం కల్పించింది.

అటుపై 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఆర్బీఐ ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. అప్పట్లో గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకును ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో విలీనం చేశారు. అయితే,గడిచిన కొన్నాళ్లుగా విత్‌డ్రాయల్స్‌ కన్నా డిపాజిట్లే అధికంగా ఉన్నాయని ఆర్బీఐ వర్గాల కథనం.

యస్‌ బ్యాంక్‌ ఇప్పటిదాకానైతే రుణ సదుపాయం వినియోగించు కోలేదని, అసలు ఆ అవసరం కూడా రాకపోవచ్చని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉందని యస్‌ బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మరోసారి భరోసానిచ్చారు.

బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బయటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కుమార్ తెలిపారు. రుణ వితరణలో లొసుగులు, మొండిబాకీలు, నిధుల కొరతతో సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌పై మార్చి ఐదవ తేదీన ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో బుధవారం నుంచి యస్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభం అయ్యాయి. ఆర్బీఐ విడుదల చేసే ఈ అత్యవసర రుణాన్ని యెస్ బ్యాంకు కరంట్ అక్కౌంట్ బ్యాలెన్స్‌కు అనుసంధానం చేస్తామని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. 

also read 29 వేల దిగువకు సెన్సెక్స్.. రెడ్ లోనే ఆసియా ఇండెక్స్‌లు

యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం ఎత్తివేసి, సాధారణ కార్యకలాపాలు ప్రారంభించినా చాలా వరకు శాఖలు ఖాళీగానే కనిపించాయి. 13 రోజుల విరామం తర్వాత బుధవారం సాయంత్రం నుంచి బ్యాంకులో పూర్తి స్థాయి కార్యకలాపాలకు అనుమతులు వచ్చాయి. కానీ ఖాతాదారులు పెద్దగా రాలేదు. కరోనా భయంతో వీరు బ్యాంకుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ భాగస్వామిగా రావడంతో కొంత భయం తగ్గిందని ఓ వినియోగదారుడు తెలిపారు. 

పూరి జగన్నాథస్వామి ఆలయానికి చెందిన రూ. 389 కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్‌ ఖాతాను ఎస్బీఐకి బదలాయించినట్లు యస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ ఎఫ్‌డీపై రూ. 8.23 కోట్ల మేర వడ్డీ జమ చేసినట్లు వివరించింది. మరో రూ. 156 కోట్ల రెండు ఎఫ్‌డీలను ఈ నెలాఖరులోగా బదలాయించనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ కృష్ణన్‌ కుమార్‌కు యస్‌ బ్యాంక్‌ లేఖ రాసింది.  

click me!