అంచనాలను మించి.. రికార్డు ఆదాయం ప్లస్ రిలయన్స్ లాభం 10,104 కోట్లు

By rajesh yFirst Published Jul 20, 2019, 5:31 PM IST
Highlights

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ విశ్లేషకుల అంచనాలను మించి ఫలితాలు సాధించింది.తొలి త్రైమాసికం గ్రూప్ లాభాల్లో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లదే పెద్దపీట. జూన్‌ త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.10,104 కోట్లు 

న్యూఢిల్లీ: విశ్లేషకుల అంచనాలను మించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రాణించింది. అనుకున్నట్లే రిటైల్‌, టెలికం వ్యాపారాలు దన్నుగా నిలిచాయి. ఫలితంగా నికర లాభం మెరుగ్గా నమోదైంది. రికార్డు ఆదాయం ఆర్జించడమూ విశేషమే. మార్కెట్‌ వర్గాల ఊహకు మిన్నగా రిఫైనింగ్‌ విభాగం స్థూల మార్జిన్‌ నమోదు చేసింది. 

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం క్రితం ఏడాది ఇదే మూడు నెలలతో పోలిస్తే 6.82 శాతం మేర వృద్ధి చెంది రూ.10,104 కోట్లకు చేరుకుంది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 2.5 శాతం తక్కువైనా.. విశ్లేషకుల అంచనాల కంటే మిన్నగా నమోదు చేసుకుంది. 

 

రిటైల్‌, జియో మొత్తం లాభంలో 32 శాతం వరకు వాటాను అందించడం ఇందుకు నేపథ్యం. రిలయన్స్‌ టెలికాం విభాగం జియో నికర లాభం 45.60 శాతం వృద్ధి చెంది రూ.891 కోట్లకు చేరగా.. రిటైల్‌ విభాగ లాభం 47.5% పెరిగి రూ.38,196 కోట్లుగా నమోదైంది. 

 

‘అంతర్జాతీయ స్థూల ఆర్థిక వాతావరణం, హైడ్రోకార్బన్‌ మార్కెట్‌ పరిస్థితులు బలహీనంగా ఉన్నా.. మా తొలి త్రైమాసిక ఫలితాలు బలంగా నమోదయ్యాయి. రిటైల్‌, డిజిటల్‌ సేవల వ్యాపారాలపై మా దృష్టి కొనసాగుతుంది. రిలయన్స్‌ రిటైల్‌ అటు ఆదాయం, ఇటు నిర్వహణ ఆదాయం మెరుగైన వృద్ధి నమోదు చేయడం సంతోషకరం’ అని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.

 

రిలయన్స్ ఏకీకృత నికర లాభం విషయంలో జనవరి-మార్చిలో నమోదైన రూ.10,362 కోట్లే ఇప్పటి వరకూ అత్యధికం కాగా.. స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ సమీక్షిస్తున్న త్రైమాసికంలో రూ.9036 కోట్ల రికార్డు లాభాన్ని నమోదు చేయడం విశేషం. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక ఏకీకృత ఆదాయం రూ.1,72,956 కోట్లుగా నమోదు కావడమూ రికార్డే. 

 

కంపెనీ కీలక చమురు వ్యాపారంలో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌) బారెల్‌కు 8.1 డాలర్లు నమోదైంది. సింగపూర్‌ కాంప్లెక్స్‌ మార్జిన్‌ (4.6 డాలర్లు)తో పోలిస్తే ఇదే ఎక్కువే. 

 

విశ్లేషకులు కంపెనీ జీఆర్‌ఎమ్‌ 8 డాలర్లుగా నమోదు కావొచ్చని అంచనా వేయగా.. అంత కంటే కాస్త ఎక్కువే వచ్చింది. మొత్తం మీద గ్రూప్‌ షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్‌) రూ.17.1కు చేరింది. అంతక్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో ఇది రూ.16 మాత్రమే. 

 

ఇక తొలి త్రైమాసికం సమయానికి మొత్తం అప్పులు రూ.2,88,243 కోట్లకు చేరుకున్నాయి. మార్చి నెలాఖరు నాటికి రూ.2,87,505 కోట్ల రుణాలు ఉన్నాయి. గత నెలాఖరుకల్లా నగదు, నగదు సమాన నిల్వలు అంతక్రితం త్రైమాసికం చివరితో పోలిస్తే రూ.1,33,027 కోట్ల నుంచి రూ.1,31,710 కోట్లకు చేరుకున్నాయి. 

 

జియో గిగాఫైబర్‌ సేవల బీటా పరీక్షలు  ఇప్పటికే విజయవంతమయ్యాయని త్వరలోనే పూర్తి స్థాయి సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. 5 కోట్లకు పైగా గృహాలకు సేవలందించడమే లక్ష్యంగా వాటిని తీసుకువస్తామని తెలిపారు.

 

‘ఇక మా డిజిటల్‌ సేవలు కొత్త మైలురాళ్లను అందుకుంటూనే.. భారత మొబిలిటీ మార్కెట్‌ ముఖచిత్రాన్ని మార్చివేయడం కొనసాగిస్తూనే ఉంటాయి’ అని  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు.

 

జియో నిర్వహణ ఆదాయం 44% పెరిగి రూ.11,679 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 5.2% పెరిగినట్లయింది. ఇక పన్నుకు ముందు మార్జిన్‌ 130 బేసిస్‌పాయింట్లు పెరిగి 40.10 శాతానికి చేరింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 110 బేసిస్‌ పాయింట్లు వృద్ధి చెందింది.


 జియో ఆదాయాలు 54.5% పెరిగి రూ.14,910 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం వినియోగదారులు 2.46 కోట్లు పెరిగి 33.13 కోట్లకు పెరిగారు. సగటు వినియోగదారుడి ఆదాయం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే రూ.126.2 నుంచి రూ.122 కు తగ్గింది. 

 

రిలయన్స్ రిటైల్ విభాగం రికార్డు ఆదాయం నమోదు చేసింది. విక్రయాలు 47.5 శాతం వృద్ధితో రూ.25,890 కోట్ల నుంచి రూ.38,196 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 69.9 శాతం పెరిగి రూ.1206 కోట్ల నుంచి రూ.2,049 కోట్లకు పెరిగింది. తొలి త్రైమాసికంలో 229 కొత్త స్టోర్లు జత చేరడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 10,644 కోట్లకు చేరుకుంది. పెట్రో రసాయనాల వ్యాపారం 4.4% వృద్ధితో రూ.7508 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని నమోదు చేసింది.

 

స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే ప్రయాణించాయి. దాని ప్రభావంతో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు కూడా నేలచూపులు చూశాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేర్ 1% నష్టపోయి రూ.1249 వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. 
 

click me!