పసిడి మెరుపులు.. వెండి పైపైకి

By rajesh yFirst Published Jul 20, 2019, 4:50 PM IST
Highlights

నెలాఖరులో అమెరికా ఫెడ్ రిజర్వు పాలసీ విధానాన్ని వెల్లడించనుండటంతోపాటు మద్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధర జిగేల్మంటున్నది.
పది గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి రూ.36 వేలకు చేరువలో ఉన్నది. కిలో వెండి ధర కూడా మళ్లీ రూ.42 వేల మార్కును దాటింది.

న్యూఢిల్లీ: పసిడి ధరలు రికార్డు స్థాయిలో పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బంగారం ధర రూ.36 వేలకు చేరువైంది. 

దేశరాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.280 అధికమై రూ.35,950 పలికింది. హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 200 పెరిగి రూ.36,320కి చేరుకున్నది. పసిడితోపాటు వెండి మరింత మెరిసింది. 

పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి వచ్చిన మద్దతుతో కిలో ధర ఒకేరోజు రూ. 935 ఎగబాకి మళ్లీ రూ.42 వేల మార్క్‌ను దాటి రూ.42,035 వద్దకు చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.

గత మూడు రోజుల్లో వెండి ఏకంగా రూ.1,925 పెరుగడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఆరు నెలల గరిష్ఠ స్థాయికి 1,452.95 డాలర్లకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా అతి విలువైన లోహాలు మరింత పుంజుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తపాన్ పటేల్ తెలిపారు. 

ఈ నెల చివర్లో ఫెడరల్ రిజర్వు ప్రకటించనున్న పరపతి సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉండటం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో పుత్తడి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. 

భవిష్యత్‌లో ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తపాన్ పటేల్ అన్నారు. ఫ్యూచర్ మార్కెట్లో ఆగస్టు నెల కాంట్రాక్టుగాను 0.65 శాతం పెరిగి రూ.35,409కి చేరుకోగా, ఆక్టోబర్‌కు రూ.36 వేల మార్క్‌ను దాటింది.

click me!