ఎయిరిండియా సేల్స్ బాధ్యత కూడా ‘షా`కే

By rajesh yFirst Published Jul 19, 2019, 1:28 PM IST
Highlights
  • నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ సంస్థను చక్కదిద్దే బాధ్యతను అమిత్ షాకు అప్పగించిన మోదీ.
  • ఎయిరిండియాలో 100 శాతం వాటాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యతనూ అప్పగించారు. 
  • అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా (ఏఐ)లో పెట్టుబడుల ఉపసంహరణకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి హోం మంత్రి అమిత్‌ షా సారథ్యం వహించనున్నారు. మంత్రుల ప్యానల్‌ నుంచి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తప్పుకోవటంతో ఆయన స్థానంలో అమిత్‌ షాను ప్రధాని నరేంద్రమోదీ నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణకు ఏర్పాటు చేసిన  మంత్రుల బృందంలో అమిత్‌షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)ను గాడిన పెట్టే అంశాన్ని ఇప్పటికే హోం మంత్రి అమిత్‌ షాకు అప్పగించిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించే ఉద్దేశంతో 2017 జూన్‌లో ఎయిర్‌ ఇండియా స్పెసిఫిక్‌ ఆల్టర్నేటివ్‌ మెకానిజం (ఏఐఎస్‌ఏఎం) పేరుతో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. 
నాటి బృందంలో అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు, రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు, విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఉన్నారు. తాజాగా రెండో సారి మోదీ సర్కార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్యానల్‌ను తిరిగి ఏర్పాటు చేశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

2017లో ఐదుగురు సభ్యులుండగా ఇప్పుడు నలుగురితో దీన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నాయి. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వాటాల ఉపసంహరణ ద్వారా రూ.85 వేల కోట్ల ఆదాయాన్ని పొందిన కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లకు పెంచింది.

2018లో ఎయిరిండియా విక్రయానికి ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ప్రభుత్వం తన 76 శాతం వాటాతోపాటు యాజమాన్య నియంత్రణ హక్కులను వదులుకునేందుకు సిద్ధ పడింది. కానీ ఆ ప్రక్రియ విఫలమైంది. ఇంతకుముందు ప్రక్రియలో వైఫల్యాలను పరిగణనలోకి తీసుకుని వాటాల ఉపసంహరణ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ నెల 26న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. 
 

click me!