నివేదికలను వెల్లడించాల్సిందే: రిజర్వ్ బ్యాంకుకు సుప్రీం ఆదేశాలు

By rajashekhar garrepallyFirst Published 26, Apr 2019, 11:16 AM IST
Highlights

సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వెల్లడించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. లేదంటే ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వెల్లడించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను ఆదేశించింది. లేదంటే ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

భారతీయ రిజర్వు బ్యాంక్ నాన్ డిస్‌క్లోజర్ పాలసీ 2015లో తాము ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆర్టీఐ చట్టం కింద నివేదికలను వెల్లడించడంలో ఆర్బీఐ రెండో ఆలోచన కూడా చేయకూడదని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఆర్ షాలతో  కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

సమాచార హక్కు చట్టం కార్యకర్తలు కోరిన వార్షిక తనిఖీ నివేదికలను, ఇతర వివరాలను వెల్లడించేందుకు ఆర్బీఐకి చివరి అవకాశం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ తీర్పును ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పింది.

 

Last Updated 26, Apr 2019, 11:34 AM IST